నోరుపారేసుకున్న మహువా | mahua moitra comments on amit shah over immigrants | Sakshi
Sakshi News home page

నోరుపారేసుకున్న మహువా

Aug 29 2025 4:29 PM | Updated on Aug 30 2025 5:58 AM

mahua moitra comments on amit shah over immigrants

చొరబాట్లను అడ్డుకోలేకపోతున్నందుకు అమిత్‌ షా తల నరికెయ్యాలని వ్యాఖ్యలు

సర్వత్రా విమర్శలు

కోల్‌కతా: సంచలనాలకు మారుపేరైన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా మరో వివాదానికి తెరతీశారు. దేశంలోకి యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ చొరబాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అడ్డుకోలేకపోతున్నారని, అందుకు శిక్షగా ఆయన తల నరికేయాలని తేల్చిచెప్పారు. శుక్రవారం పశి్చమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పొరుగుదేశం బంగ్లాదేశ్‌ నుంచి ఇండియాలోకి చొరబాట్లు జరుగుతున్నాయని చెప్పారు. 

సరిహద్దుల్లో రక్షణ భద్రత కేంద్ర హోంశాఖ మంత్రిగా పదవిలో ఉన్న అమిత్‌ షాదేనని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ పౌరుల రాకను అడ్డుకొనే సత్తా లేని అమిత్‌ షా ఆ నెపాన్ని పశి్చమ బెంగాల్‌ ప్రభుత్వంపై వేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. చొరబాటుదార్లు వస్తున్నారంటూ తరచుగా గొంతు చించుకుంటున్న ఆయనకు వారిని అడ్డుకొనే బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. 

అక్రమ వలసల కారణంగా దేశంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయంటూ ఆగస్టు 15న స్వాతంత్య్రం దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, ఆ సమయంలో అక్కడే ఉన్న అమిత్‌ షా చప్పట్లు కొడుతూ చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారని గుర్తుచేశారు. 

దేశ సరిహద్దులను రక్షించేవారు లేకపోతే పొరుగుదేశాల నుంచి జనం వస్తూనే ఉంటారని, మన తల్లులు, అక్కాచెల్లెమ్మలపై కన్నేస్తారని, మన భూములు ఆక్రమించుకుంటారని పేర్కొన్నారు. సరిహద్దులను కాపాడలేకపోవడంతో చొరబాట్లను ఆపలేనందుకు అమిత్‌ షా తల నరికి టేబుల్‌పై పెట్టాలని మహువా మొయిత్రా పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో సంబంధాలు క్షీణించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వమే కారణమని అన్నారు. గతంలో మన మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్‌ ఇప్పుడు శత్రుదేశంగా మారిపోయిందని చెప్పారు.  

మొయిత్రాది తాలిబన్‌ మైండ్‌సెట్‌: బీజేపీ  
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అమిత్‌ షాపై ఆమె చేసిన విమర్శల వీడియో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. మొయిత్రాది తాలిబన్‌ మైండ్‌సెట్, తాలిబన్‌ కల్చర్‌ అని ధ్వజమెత్తారు. ఆమెపై కొత్వాలీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

మొయిత్రా జిహాదీ ఉగ్రవాదుల తరహాలో మాట్లాడారని బీజేపీ అధికార ప్రతనిధి షెహజాద్‌ పూనవాలా ఆరోపించారు. మొయిత్రా వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించారు. రాజకీయంగా ఎదిరించాలి తప్ప హింసను ప్రేరేపించేలా మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. ప్రభుత్వ విధానాలపై నిలదీయడంలో తప్పులేదన్నారు. వ్యక్తిగతంగా మాటల దాడి చేయొద్దని సూచించారు. ఎవరైనా సరే వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని స్పష్టంచేశారు.  ­    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement