
సాక్షి ముంబై: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తామని బెదిరిస్తూ సీఆర్‌పీఎఫ్‌కు కార్యాలయానికి ఒక మెయిల్ అందింది. ముంబైలోని సీఆర్‌పీఎఫ్ కేంద్ర కార్యాలయానికి ఇటీవల అందిన ఆ మెయిల్ విషయం మంగళవారం బయటకు పొక్కింది. షా, యోగిలతోపాటు దేశంలోని ప్రార్థనా స్థలాలు, ప్రాముఖ్యం ఉన్న ప్రాంతాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడతామనీ, ఇందుకోసం 11 మంది ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. మెయిల్‌ను సీఆర్పీఎఫ్ అధికారులు విచారణ నిమిత్తం దర్యాప్తు సంస్థలకు పంపడంతోపాటు ఆ ఇద్దరు వీవీఐపీ నేతల భద్రతను పటిష్టం చేశారు.
అయితే, బీజేపీ సీనియర్ నేతలైన వీరిద్దరికీ బెదిరింపు లేఖలు గతంలోనూ వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో యోగిని చంపుతామంటూ ‘డయల్ 112’కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. గత ఏడాది నవంబర్‌లో కూడా యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ వాట్సాప్ మెసేజీ రాగా పోలీసులు విచారణ చేపట్టి ఆగ్రాకు చెందిన ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఉండగా, మావోయిస్టులపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మూడు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మంగళవారం ఆయన బాసగూడ సీఆర్పీఎఫ్ క్యాంపును సందర్శించి, జవాన్లనుద్దేశించి మాట్లాడారు.