Punjab Assembly Election 2022: మాల్వా చిక్కితే అసెంబ్లీ అందినట్టే | Malwa Changing Equations in Key Punjab Regions ahead of 2022 Polls | Sakshi
Sakshi News home page

Punjab Assembly Election 2022: మాల్వా చిక్కితే అసెంబ్లీ అందినట్టే

Published Sun, Feb 6 2022 7:51 AM | Last Updated on Sun, Feb 6 2022 8:23 AM

Malwa Changing Equations in Key Punjab Regions ahead of 2022 Polls - Sakshi

మాల్వా చిక్కితే అసెంబ్లీ అందినట్టే’ అన్నది పంజాబ్‌ రాజకీయాల్లో నానుడి. అందుకే ఎప్పట్లాగే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, ఆప్, అకాలీదళ్, బీజేపీ మాల్వా జపం చేస్తున్నాయి. తమనే కరుణించాలంటూ అక్కడి ఓటర్లను వేడుకుంటున్నాయి. హామీలపై హామీలు గుప్పిస్తున్నాయి. ఇక్కడ మొగ్గు ఆప్‌ వైపే ఉందని సర్వేలు చెబుతుండటంతో మిగతా పార్టీలు వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. 

పంజాబ్‌లో భౌగోళికంగా, ఓటర్లపరంగా కూడా అతి పెద్ద ప్రాంతమైన మాల్వా ప్రతి ఎన్నికల్లోనూ పార్టీల భాగ్యరేఖలను నిర్దేశిస్తూ వస్తోంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా సీట్లు (69) ఇక్కడే ఉన్నాయి. దాంతో మాల్వాలో మెజారిటీ సీట్లు గెలిచిన పార్టీకే అధికార పీఠం దక్కడం ఆనవాయితీగా మారింది. అకాలీదళ్‌ అడ్డాగా పేరుబడ్డ ఈ కాటన్‌ బెల్టు (పత్తి పంట ఎక్కువగా పండే ప్రాంతం)లో 2017లో కాంగ్రెస్‌ ఏకంగా 40 సీట్లు కొల్లగొట్టి అధికారాన్ని అందుకుంది. అసెంబ్లీకి రాచమార్గంగా మారిన మాల్వాలో ఎలాగైనా పట్టు సాధించేందుకు పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్‌ వర్గాలవారీగా ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఆప్‌ కూడా వాటికి ఏ మాత్రమూ తగ్గకుండా హామీలు గుప్పిస్తోంది. 

పోటాపోటీ హామీలు  
పంజాబ్‌... మాల్వా, దౌబా, మఝా ప్రాంతాల సమాహారం. దౌబాలో 23, మఝాలో 25 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక మాల్వా బాగా వెనకబడ్డ ప్రాంతం. ముఖ్యంగా దక్షిణ మాల్వా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా కూడా వెనకబడే ఉంది. రైతు ఆత్మహత్యలకు రాష్ట్రంలో చిరునామాగా మారింది. ఇక రాష్ట్ర దళిత జనాభాలో 31 శాతం ఇక్కడే ఉన్నారు. ఈ సమస్యలతో పాటు ఈ ప్రాంతాన్ని పీడిస్తున్న క్యాన్సర్, తీవ్ర తాగునీటి కొరత ఈ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా మారాయి. దాంతో పార్టీలు వీటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. రాష్ట్ర దళిత జనాభాలో 31 శాతం మాల్వాలోనే ఉన్నా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేంతగా వీరు సంఘటితంగా నిలవడం లేదు. కానీ ఈసారి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్న కాంగ్రెస్, బీజేపీ, ఆప్, అకాలీదళ్‌ వీరిని కూడా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అందులో భాగంగా రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. 2012 ఎన్నికల్లో అకాలీదళ్‌ ప్రకటించిన దాల్‌–ఆటా పథకం మాల్వా దళితుల్లో బాగా క్లిక్కవడంతో అలాంటి హామీలకే ప్రాధాన్యమిస్తున్నాయి మిగతా రాజకీయపక్షాలు.

కాంగ్రెస్‌ అయితే మేనిఫెస్టోను మాల్వానే కేంద్రంగా చేసుకుని రూపొందించింది! ప్రతి ఇంటికీ ఉద్యోగం, ఇల్లు, నిర్వాసితులకు ఇంటి స్థలం, నెలవారీ పెన్షన్‌తో పాటు పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఆరోగ్య బీమా వంటి హామీలను ప్రకటించింది. ఆప్, బీజేపీ కూడా ఇదే తరహాలో హామీలిచ్చాయి. పేద ఓటర్లను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలూ సబ్సిడీ రేషన్‌ పథకం ప్రకటించాయి. వీటితోపాటు ఈ ప్రాంతంలో సున్నితమైన అంశంగా నిలిచే మత సెంటిమెంట్లను రాజేసేందుకు కూడా కాంగ్రెస్, ఆప్, అకాలీదళ్‌ ప్రయత్నిస్తున్నా ఈసారి ఇది పెద్దగా పని చేయకపోవచ్చంటున్నారు. తమ సమస్యలను తీరుస్తుందని నమ్మే పార్టీకే మాల్వా ఓటర్లు జై కొడతారన్నది విశ్లేషకుల అంచనా. గతంలో అంత కాకున్నా డేరాల ప్రభావాన్నీ ఏ పార్టీ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా 2007, 2012 ఎన్నికల్లో బాగా ప్రభావం చూపిన సచ్‌ఖండ్, డేరా సచ్చా సౌదా ఈసారీ ఓటర్లను ఎంతోకొంత ప్రభావితం చేయొచ్చని అంచనా. 



గతంలో అకాలీల అడ్డా 
మాల్వా ప్రాంతం సంప్రదాయికంగా అకాలీదళ్‌కు అడ్డా. 2007లో ఇక్కడ ఆ పార్టీ 19 సీట్లతోనే సరిపెట్టుకున్నా 2012లో బాగా పుంజుకుని 34 సీట్లు సాధించగలిగింది. అలాంటిది 2017లో బీజేపీ– అకాలీ కూటమి కేవలం 8 సీట్లకు పరిమితమై కోలుకోలేనంతగా దెబ్బతింది. అకాలీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు బదిలీ అయి ఆ పార్టీ 40 సీట్లు సొంతం చేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగిన ఆప్‌ ఇక్కడ 18 సీట్లు నెగ్గిసత్తా చాటింది.     – నేషనల్‌ డెస్క్, సాక్షి 

ఈసారి సర్వేల మొగ్గు ఆప్‌కే 
మాల్వాలో ఈసారి ఆప్‌ హవా ఉండొచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఆ పార్టీకి 28 నుంచి 30 సీట్ల దాకా రావచ్చని ఇటీవలి జీ ఒపీనియన్‌ పోల్‌ తేల్చింది. కాంగ్రెస్‌కు 19 నుంచి 21, అకాలీదళ్‌కు 14 రావచ్చని, బీజేపీ 3 సీట్లకు పరిమితమవుతుందని జోస్యం చెప్పింది. రాష్ట్రంలోని దౌబా, మఝా ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు తమవేనని కాంగ్రెస్‌ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న జరగనున్న పోలింగ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement