సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డి అభిప్రాయాన్ని గౌరవించి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగేంత వరకు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నిక విషయంలో జానారెడ్డికి చిన్న ఇబ్బంది కలిగినా అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని, ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారాన్ని తేల్చకపోవడమే మంచిదని వారు స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఖరారైందన్న వార్తల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచన మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్‌తో సమావేశం కావాలని నిర్ణయించారు.
అయితే, ఈ భేటీ రేవంత్ మినహా మిగిలిన నలుగురు హాజరై తమ అభిప్రాయాలను చెప్పారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహిస్తామని, అయితే సాగర్ ఉప ఎన్నిక కూడా రెండు నెలల్లోపు ముగిసే అవకాశం ఉన్నందున అప్పటివరకు అధ్యక్షుడు ఎవరన్న దానిపై అధికారిక ప్రకటన చేయకపోవడమే మేలని దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో మాణిక్కంకు వారు చెప్పినట్టు తెలిసింది. ఈ సమావేశానికి ముందే పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోవాలని సీఎల్పీ నేత భట్టికి హైకమాండ్ నుంచి ఆదేశాలొచ్చాయి. పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన భట్టి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను రాష్ట్ర ఇన్‌చార్జికి చెప్పినట్టు సమాచారం. పార్టీలోని ఒకరిద్దరు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా సాగర్ ఉప ఎన్నిక వరకు ఈ వ్యవహారాన్ని వాయిదా వేస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారని ఆయన వెల్లడించారు.
అలాగే ఏఐసీసీ సెక్రటరీ బోసు రాజు.. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో టీపీసీసీ చీఫ్ ఎంపికపై చర్చలు జరిపారు. ప్రకటనలో ఆలస్యం వద్దని.. వెంటనే వెల్లడిస్తే బాగుంటుందని సంపత్ అభిప్రాయపడగా, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ, వంశీలు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామని చెప్పారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఇన్‌చార్జీ.. ముఖ్య నాయకుల అభిప్రాయాన్ని సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తానని నేతలకు చెప్పి సమావేశాన్ని ముగించారు. ఈ నేపథ్యంలో సోనియా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసేంత వరకు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, ఇతర కమిటీల నియామక ప్రక్రియలు వాయిదా పడటం లాంఛనమే.
Comments
Please login to add a commentAdd a comment