వైఎస్సార్‌సీపీ శ్రేణులతో 9న విజయవాడలో సమావేశం  | Meeting with YSRCP cader in Vijayawada on 9th | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ శ్రేణులతో 9న విజయవాడలో సమావేశం 

Published Sat, Oct 7 2023 4:36 AM | Last Updated on Sat, Oct 7 2023 4:36 AM

Meeting with YSRCP cader in Vijayawada on 9th - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వెళ్లి వారి దీవెనలు కోరే ముందుగా మండల స్థాయి నాయకత్వంతో ఈనెల 9వతేదీన విజయవాడలో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలో శుక్రవారం తనను కలిసిన మీడియాతో ఆయన మా­ట్లా­డారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమే హాజరు కానున్నట్లు స్పష్టం చేశారు.

మండలపార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, పార్టీ పరమైన పదవులలో ఉన్నవారు, పార్టీ అనుబంధ సంఘాలు, మార్కెట్‌ యార్డు ఛైర్మన్లు తదితరులు దాదాపు 8 వేలమందికి పైగా హాజరవుతారన్నారు. ఇది పూర్తిగా ఆహ్వానితులతోనే జరుగుతున్న సమావేశమని, బహిరంగ సభ కాదని, ముఖ్యంగా ఓపెన్‌ టూ ఆల్‌ కాదని గమనించాలని కోరారు. ఈ సమావేశంలో మండల స్థాయిలో సంస్థాగతంగా అన్ని రకాలుగా లీడ్‌ చేయగలిగిన లీడర్‌షిప్‌తో ముఖ్యమంత్రి ఇంటరాక్షన్‌ ఉంటుందన్నారు. స్థానిక సంస్థలలో దాదాపు 80 శాతం గెలిచినందున ఆ నాయకత్వం అంతా హాజరవుతారన్నారు. మండల పార్టీ అధ్యక్షులు, అర్బన్‌ మండలాలకు సంబంధించి కూడా సమావేశంలో పాల్గొంటారన్నారు.

క్షేత్రస్థాయి వరకు క్రియాశీలకంగా పార్టీని లీడ్‌ చేసే వారు సమావేశానికి హాజరై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆలోచనలు, ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసిన కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్తారని వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లే వారిగా, తర్వాత ఎన్నికల వరకు జరిగే కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో లీడ్‌ చేసే వారిగా నేతలకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని,  వారికి చాలా అంశాలపై స్పష్టత వస్తుందని చెప్పారు.  

ఆరోగ్య సురక్షకు విశేష స్పందన... 
‘మేం ప్రజల అవసరాలను తెలుసుకుని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నాం. ఏడాదిన్నర క్రితం గడప గడపకూ ప్రారంభమైంది. శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరిస్తున్నారు. బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంకా పార్టీకి సంబంధించి ప్రచార కార్యక్రమాలు తయారయ్యాయి.

వాటితో పాటు పార్టీలో గృహ సారధుల వ్యవస్థ, సోషల్‌ మీడియా ఇటీవల బాగా యాక్టివ్‌ అయింది. వీటన్నింటికి  క్షేత్ర స్థాయి­లో మండలం యూనిట్‌ గా ఉంటుంది. టీడీపీ, ఇతర పార్టీలు ప్రజలతో సంబంధం లేకుండా కుట్ర రాజకీయాలు చేస్తున్నాయి. చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే పళ్లాలు మోగించడం, క్రాంతితో కాంతి లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటి?’ అని సజ్జల ప్రశ్నించారు.  

స్కిల్‌ స్కామ్‌లో 13 చోట్ల చంద్రబాబు సంతకాలు.. 
చంద్రబాబు విప్లవ కార్యక్రమమో, ఉద్యమమో చేసి జైలుకు వెళ్లినట్లు టీడీపీ హడావుడి చేస్తోందని సజ్జల విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. ఏ తప్పూ చేయకుంటే తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు. కోర్టులో సమర్పించదగ్గ ఆధారాలు సీఐడీ వద్ద ఉన్నాయన్నారు. ‘ఒక ప్రైవేట్‌ వ్యక్తిని తీసుకొచ్చి ప్రభుత్వంలో నాలుగు పదవులు ఇచ్చి పెట్టుకున్నారు. ఇందులో తప్పు  చేయలేదని అనలేరు. ఇలాంటి వాటికి చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే. చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కు సంబంధించి 13 చోట్ల సంతకాలు పెట్టిన విషయం వాస్తవమా? కాదా? ఈ విషయాలు నోట్‌ ఫైల్స్‌ లో స్పష్టంగా ఉన్నాయి.

వీటిని పక్కదోవ పట్టించడానికే ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ అంశం తెచ్చారు. అవి బాండ్స్‌ కాదు క్యాష్‌ డిపాజిట్‌ అని నాకు సమాచారం ఉంది. చంద్రబాబు దోషి కాబట్టే ఆయన ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీ అధికారులు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పినా అవినీతిని దాచే ప్రయత్నం చేశారు. పిట్ట కథలు, పిట్ట ప్రశ్నలతో స్కాం అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్‌ హయాంలో వోక్స్‌ వ్యాగన్‌ అంశంలో ఆరోపణలు వస్తే ఆ కేసును సీబీఐకి అప్పగించారు. రూ.10 కోట్లలో దాదాపు రూ.8 కోట్లు వెనక్కు తేగలిగారు’ అని సజ్జల తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement