
సాక్షి, కరీంనగర్: తనపై హత్యకు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన సంచలన ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. సానుభూతి కోసమే ఈటల చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణలో హత్యలు ఉండవు. ఉంటే.. గింటే.. రాజకీయ ఆత్మహత్యలే ఉంటాయి. ప్రజలను భయపెట్టే విధంగా ఈటల మాట్లాడారు. ఈటల వ్యాఖ్యలపై విచారణ జరగాలి. రాజేందర్ నాకు సోదరుడు లాంటివాడు. ఆయనతో మాకు గెట్ల పంచాయతి లేదు. కేవలం రాజకీయ పంచాయితీ మాత్రమే ఉంది. రాజేందర్ వ్యాఖ్యలపై సీపీ కమలాసన్ రెడ్డి విచారణ చేయాలి.
కుట్ర జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈటలకి చెప్పిన మాజీ నక్సలైటుని విచారించాలి. ఆయన వ్యాఖ్యలపై విచారణ జరపాలని డీజీపీని కోరుతున్నాను. ఈటల వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలని రెచ్చగొట్టేలా ఉన్నాయి. నాపై ఎలాంటి నేర చరిత్ర లేదు. ఓట్ల సానుభూతి కోసం ఈటల దిగజారి ఈ వ్యాఖ్యలు చేసారు. దోషి అయినా దొరకాలి లేదా ఈటల రాజేందర్ తనవి తప్పుడు వ్యాఖ్యలు అని ఒప్పుకోవాలి. హుజురాబాద్ అంటే కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువ. అందుకే ‘‘దళిత బంధు’’ను హుజురాబాద్ కేంద్రంగా ప్రవేశపెడుతున్నారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రణాళిక జరిగినది. ఎన్నకలకు, దళిత బంధు ప్రవేశానికి ఎలాంటి సంబంధం లేదు.’’ అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment