
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు ఆపేయమని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం దుర్మార్గం. సీఎం కేసీఆర్ పథకాలు ఆపాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కేసీఆర్ పథకాలు లేవు అంటూ వ్యాఖ్యలు చేశారు.
కాగా, మంత్రి జగదీష్ రెడ్డి గురువారం సూర్యాపేట పట్టణంలో గడపకు గడపకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చర్యలపై ప్రజలు ఉద్యమించి తిరగబడాలి. గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలదీయండి. ఉచిత విద్యుత్, మిషన్ భగీరథను కూడా కాంగ్రెస్ ఆపేలా ఉంది. కేసీఆర్ పథకాలు ఆపాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. తెలంగాణ మోడల్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్‌కి భయం పట్టుకుంది.
కర్ణాటకలో ఏకంగా కరెంట్ కోసం సబ్ స్టేషన్లలో మొసలిని వదిలే దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కేసీఆర్ పథకాలు లేవు. ఇక్కడ కేసీఆర్ పథకాలు ఆపేస్తే దేశంలో ఎక్కడా పథకాల గురించి పంచాయితీ ఉండదని కాంగ్రెస్ నేతల ఆలోచన. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను ప్రజలు గమనించాలి. కాంగ్రెస్, బీజేపీలు పోటీచేసే అభ్యర్ధులని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. బీజేపీకి రెండు సార్లు అధికారం ఇస్తే దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చింది. బీజేపీ పాలనలో పెనం నుండి పొయ్యిలో పడ్డ చందంగా దేశ ప్రజల పరిస్థితి తయారైంది. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బీజేపీకి అసలు అభ్యర్థులే లేరు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: అందుకే రాజీనామా చేస్తున్నా.. బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల గుడ్‌బై