సాక్షి, హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.18 వేల కోట్లిస్తే ఉప ఎన్నిక బరి నుంచి టీఆర్‌ఎస్ తప్పుకుంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఓ కాంట్రాక్టర్ బలుపు, అహంకారంతో మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని, మునుగోడులో రూ.500 కోట్లు ఖర్చు చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోందన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్‌వీ) సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘మునుగోడు ప్రజలను అంగట్లో సరుకులా కొనుగోలు చేయొచ్చనే అహంకారంతోనే మోదీ ఈ ఉప ఎన్నిక తెచ్చారు.
రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చిన రూ.18 వేల కాంట్రాక్టు మొత్తాన్ని మునుగోడు అభివృద్ధికి వెచ్చిస్తే ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటామని జగదీశ్‌రెడ్డి చేసిన ప్రకటనతో ఏకీభవిస్తున్నా. ఆ రూ.18వేల కోట్ల కాంట్రాక్టులో ఎలాంటి మతలబు లేదని యాదాద్రిలో, భాగ్యలక్ష్మి గుడి దగ్గర బండి సంజయ్ గుండు మీద రాజగోపాల్‌రెడ్డి ప్రమాణం చేయాలి. ఈ కాంట్రాక్టుపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘ఈడీ, సీబీఐ తదితర సంస్థలను కేంద్రం వేటకుక్కల్లా వాడుకుంటోంది. మోదీ, ఈడీలకు తెలంగాణలో భయపడేవారెవరూ లేరు. తెలంగాణ కోసం ప్రాణాలైనా అర్పిస్తాం కానీ బీజేపీకి భయపడే ప్రసక్తే లేదు’అని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రీ ఫైనల్ కాదు.. యూనిట్ టెస్ట్..
‘మునుగోడులో కాంగ్రెస్, బీజేపీ ఏకమయ్యాయి అనేందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విదేశాలకు వెళ్తున్న తీరే నిదర్శనం. కోమటిరెడ్డి సోదరులు కోవర్టులుగా మారారు. ఈ ఉప ఎన్నిక 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ప్రీ ఫైనల్స్ కాదు, యూనిట్ టెస్టే. అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 105 సీట్ల బలం ఉంది. ఒకటి రెండు సీట్లతో ఒరిగేదేమీ లేదు. మునుగోడులో గెలిచేది టీఆర్‌ఎస్ మాత్రమే’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘గుజరాత్ వాళ్లు ఇక్కడ రాజకీయం చేసినపుడు కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్తే తప్పేంటి. బీఆర్‌ఎస్ ఏర్పడినా.. జెండా, ఎజెండా మారదు. వైఎస్, చంద్రబాబు వంటి రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు ఓ పద్దతి ఉండేది, కానీ ఇప్పుడున్న ప్రత్యర్థులు బఫూన్లు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. క్షుద్ర పూజల గురించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ఎన్‌కౌంటర్లు లేని రాష్ట్రం తెలంగాణ..
చంద్రబాబు హయాంలో విద్యార్థులను నక్స లైట్లుగా ముద్రవేసే వారని, కేసీఆర్ హయాంలో ఎన్‌కౌంటర్లు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీని వాస్‌యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, వాసుదేవరెడ్డి, కె. మన్నె క్రిషాంక్, మాజీ మేయర్ రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్‌లు పాల్గొన్నారు.
చదవండి: దివంగత ములాయం సింగ్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు
Comments
Please login to add a commentAdd a comment