సాక్షి, తాడేపల్లి: అందరికీ నమస్కారం పెట్టిన పవన్ కల్యాణ్.. తనకు జీవితాన్ని ప్రసాదించిన సొంత అన్న చిరంజీవినే మర్చిపోయారని.. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. చిరంజీవి లేకుంటే అసలు పవన్ కల్యాణ్ ఉండేవాడా? అని సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చిరంజీవికి ఎందుకు నమస్కారం పెట్టలేదని నిలదీశారు.
టీడీపీ బాగుండాలనే పవన్ కోరుకుంటున్నాడని మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పవన్ ఎప్పుడు తమ పార్టీలోకి వస్తారని టీడీపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారని అన్నారు. తాను పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి అంటున్న పవన్.. 2014 నుంచి 2019 మధ్య ఎందుకు ప్రశ్నించలేదు? అని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చకూడదనే ఉద్దేశం ఇప్పుడే ఎందుకు ఆయన కలిగిందో చెప్పాలని పవన్‌ను నిలదీశారు మంత్రి పేర్ని నాని.
తీగలాంటి నీకు ఊతకర్రలా చిరంజీవి నిలబడ్డారని పేర్ని నాని అన్నారు. బీజేపీ, టీడీపీలను కలిపేందుకు పవన్ ప్రయత్నించాడని దుయ్యబట్టారు. ఆనాడు అమరావతి కుల రాజధాని అన్న మాటలు గుర్తులేదా? అని ప్రశ్నించారు. పవన్‌ది పూటకో సిద్ధాంతం, రోజుకో సిద్ధాంతం అని ఎద్దేవా చేశారు. పవన్ మాత్రం ఏమైనా అనొచ్చు.. పవన్‌ను అంటే మానసిక అత్యాచారమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి ఏం చేశారు? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీని గట్టిగా అడగలేరా? అని నిలదీశారు. విభజన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని అడగలేరా? అని సూటిగా ప్రశ్నించారు. శాసనాలు చేసి అమలు చేయని బీజేపీని చొక్కా పట్టుకుని అడగగలరా? అని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ సినిమా డైలాగులే చెప్పారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment