ఈ విషయమై చర్చకు సిద్ధమా?
బీజేపీ నేతలకు మంత్రి పొన్నం సవాల్
పదేళ్లలో కేంద్రం ఏం చేసిందో చెప్పి బీజేపీ ఓట్లడగాలి
కరీంనగర్ కార్పొరేషన్: పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమిటో ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై బీజేపీ నేతలు చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. రాష్ట్రానికి చేసిందేమిటో సమాధానం చెప్పాకే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు ఓట్లు అడగాలన్నారు. ఆంబేడ్కర్ జయంతి సందర్భంగా పదేళ్ల బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఆదివారం కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష చేపట్టారు.
ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ ఎంపీ బండి సంజయ్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడుగుతున్నారని, తాము అధికారంలోకొచ్చి నాలుగు నెలలే అయిందని, అంతకుముందు పదేళ్లు అధికారంలో ఉండి అమలు చేయని హామీల మాటేమిటని ప్రశ్నించారు. బీజేపీ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ నిరసన దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు.
నల్లధనాన్ని బయటకు తీసి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు పింఛన్ ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్ర విభజన హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. గతంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన పరిశ్రమలను మోదీ ప్రైవేట్ పరం చేస్తూ అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.
డిపాజిట్లు రాని బీజేపీతో కాంగ్రెస్‌కు పోటీ ఏంటి?
బీజేపీకి 2014లో 105 సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదని, 2018లో 100 సీట్లలో, 2023లో 70కి పైగా సీట్లలో డిపాజిట్ రాలేదని, అలాంటి బీజేపీకి కాంగ్రెస్‌తో పోటీనా అని పొన్నం వ్యాఖ్యానించారు. మోదీ ఫొటోతో ఓట్లు రావని బీజేపీ నేతలకు కూడా తెలుసని అందుకే రాముడి ఫొటోలతో ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. దీక్షలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment