టచ్‌ చేసి చూడండి..ఏం జరుగుతుందో!  | Minister Ponnam Prabhakar Fires on KTR: Telangana | Sakshi
Sakshi News home page

టచ్‌ చేసి చూడండి..ఏం జరుగుతుందో! 

Published Sun, Mar 31 2024 3:56 AM | Last Updated on Sun, Mar 31 2024 11:50 AM

Minister Ponnam Prabhakar Fires on KTR: Telangana - Sakshi

బీజేపీ నోట బీఆర్‌ఎస్‌ పాట.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌ 

మాది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం.. ఎవరూ ఏమీ చేయలేరు 

బీసీలకు టికెట్లు అంటూ కేటీఆర్‌ మాట్లాడటం విడ్డూరం 

బీఆర్‌ఎస్‌కు బీసీని అధ్యక్షుడిని చేయాలని వ్యాఖ్య 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని మొన్నటివరకు బీఆర్‌ఎస్‌ పాట పాడిందని.. ఇప్పుడు బీజేపీ నేతల నోట అదే పాట వినిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యా నించారు. తలచుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామన్న బీజేపీ ఎమ్మెల్యే ఏలే టి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘కాంగ్రెస్‌ను టచ్‌ చేసి చూడండి.. ఏం జరుగుతుందో’అని హెచ్చరించారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, తమను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. పొన్నం శనివారం గాం«దీభవన్‌లో టీపీసీసీ నేతలు నిజాముద్దీన్, కోట్ల శ్రీనివాస్‌ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడానికి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఏమైనా జ్యోతిష్యం చదువుకున్నారా అని ప్రశ్నించారు. 

బీఆర్‌ఎస్‌కు బీసీని అధ్యక్షుడ్ని చేయండి 
లోక్‌సభ ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపుపై మంత్రి కేటీఆర్‌ మాట్లాడటం విడ్డూరమని పొన్నం విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటైన 23 ఏళ్లలో ఒక్క బీసీ నేత అయినా ఆ పారీ్టకి అధ్యక్షుడయ్యారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక అయినా, లేక ఎన్నికల్లో ఓడిపోయాక అయినా బీసీలకు అధ్య క్ష పదవి ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేత, ప్రతిపక్ష నేత, మండలిలో ప్రతిపక్ష నేత.. ఇలా ఏ పదవిని కూడా బీసీలకు ఇవ్వకుండా.. బీసీలను ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడటం ఏమిటని నిలదీశారు.

తమ ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి, రూ.150 కోట్లు నిధులు ఇచి్చందని, 17 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. కాంగ్రెస్‌తోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ పారీ్టలో బీసీలకు అన్యాయం జరిగితే పారీ్టలో అంతర్గతంగా అడుగుతామని, బీఆర్‌ఎస్‌లో అలా అడిగే స్వేచ్ఛ కొంచెమైనా లేదని విమర్శించారు. 

బీసీని అధ్యక్ష పదవి నుంచి తీసేసి.. 
బలహీనవర్గాల నాయకుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేసిన బీజేపీ.. బీసీ నేతను సీఎం చేస్తామని చెప్పడం ఏమిటని పొన్నం నిలదీశారు. అవినీతి చేసినందుకే బండి సంజయ్‌ను తీసేశామని కిషన్‌రెడ్డి వర్గం చెప్తుంటే.. కిషన్‌రెడ్డిని కేసీఆర్‌ నియమించుకున్నారని బండి సంజయ్‌ వర్గం అంటోందని వ్యాఖ్యానించారు. కాగా.. మంత్రులు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు అంటున్నారని మీడియా ప్రస్తావించగా.. తనను అలాంటి చర్యకు పాల్పడాలని అడిగే ధైర్యం ఎవరికీ లేదని, కలలో కూడా బీజేపీ ఊసెత్తనంటూ మంత్రి పొన్నం మీసం మెలి తిప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement