మీడియాతో మాట్లాడుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్. చిత్రంలో గంగుల కమలాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీకి దమ్ముంటే పార్లమెంటును రద్దు చేయాలని, తాము కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి అసెంబ్లీని రద్దు చేయిస్తామని, అప్పుడు జరిగే ఎన్నికల్లో గెలుపు ఎవరిదో చూసుకుందామని సవాలు చేశారు.
శుక్రవారం మంత్రులు టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రోజుకు పది జతల దుస్తులు మార్చడం తప్ప మోదీ ఈ ఎనిమిదేళ్లలో దేశానికి చేసిందేమీ లేదని తలసాని విమర్శించారు. దావోస్‌లో పెట్టుబడులు రాబడుతున్న కేటీఆర్.. రాబోయే రోజుల్లో దేశానికి నాయకత్వం వహిస్తారని మోదీ భయపడుతున్నారా? అని ప్రశ్నించారు.
భారత్ బయోటెక్ సందర్శన సమ యంలో సీఎంను వెంట రావద్దని మోదీ కొత్త సం ప్రదాయానికి తెరలేపారన్నారు. హోం మంత్రి అమిత్ షా కొడుకు బీసీసీఐ కార్యదర్శి కావడం కు టుంబ రాజకీయం కిందకు రాదా? అని ప్రశ్నించారు. యూపీ ఎన్నికల్లో ఓట్ల కోసం మూఢ విశ్వాసాలను వాడుకున్నది బీజేపీ మాత్రమేనని, సీఎం ఎన్నిక ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరుగుతుందని, బీజేపీ చెప్పినట్లు వ్యవస్థలు నడవవని ఆయన పేర్కొన్నారు. కాగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణలో కులపరమైన చీలికలు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో గెలిచి వచ్చారు: గంగుల
తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని మోదీ వ్యాఖ్యానించడాన్ని మంత్రి గం గుల కమలాకర్ తప్పుబట్టారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టారన్నారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని మోదీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బండి సంజయ్‌కు అధికారం ఇస్తే మసీదులు తవ్వడం మినహా మరేమీ చేయరని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment