చిలకలూరిపేట/గుడివాడటౌన్/పామర్రు: పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ గూండాలు రెచ్చిపోయిన ఘటనకు చంద్రబాబే బాధ్యుడని మంత్రులు, ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఆయన ప్రోత్సాహంతోనే వారు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక బీసీలపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎవరేమన్నారంటే..
బీసీలపై చంద్రబాబుకున్న కక్షకు పరాకాష్ట: మంత్రి విడదల రజిని
బీసీల జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని హెచ్చరించారు. చిలకలూరిపేటలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాచర్లలో టీడీపీ గూండాలు జరిపిన దాడిని బీసీలందరిపై జరిగిన దాడిగా భావిస్తూ.. దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అమాయక బీసీలపై తెగబడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సీఎం జగన్ పాలనలో బీసీలంతా భద్రంగా ఉన్నారని, ధైర్యంగా, గర్వంగా, ఆత్మవిశ్వాసంతో జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. తాము చేపట్టిన జయహో బీసీ సభకు రాష్ట్రంలోని బీసీ సోదరులంతా సంఘీభావం తెలపడాన్ని చూసి ఓర్వలేని చంద్రబాబు.. బీసీలపై కక్ష తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ఆటలు ఇక సాగవని, బీసీలంతా ఆయనకు బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రజిని హెచ్చరించారు.
మాచర్ల దాడులకు బాబే స్ఫూర్తి: మాజీ మంత్రి కొడాలి నాని
మాచర్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు చేసిన దాడికి చంద్రబాబు మాటలే స్ఫూర్తి అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కర్నూలులో జరిగిన సభలో ఆయన తెలుగుదేశం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను గుడ్డలూడదీసి కొట్టాలని పిలుపునిచ్చారని, ఆ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుని మాచర్లలో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారని విమర్శించారు.
గతంలోనూ బహిరంగ సభల్లో బయటకు లాగి కొడతా, బట్టలూడదీసి కొడతా.. అంటూ ప్రసంగించారని, వాటికి ముగ్థులైన టీడీపీ కార్యకర్తలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. 70ఏళ్ల వయసులో చంద్రబాబు చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే ఆయనకు మతి భ్రమించినట్లుందన్నారు.
సీఎం జగన్‌ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేకే: మాజీ మంత్రి పేర్ని నాని
సీఎం జగన్‌ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు. రెండు పేపర్లు, నాలుగు చానళ్లతో ముసుగు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరని స్పష్టంచేశారు. ప్రతిపక్షాల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ సీఎం జగన్ గత మూడున్నరేళ్లుగా ముందుకు సాగుతున్నారని చెప్పారు.
చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు అనేక నీచమైన పనులు చేస్తూ.. అర్హత ఉన్నా కనీసం పింఛన్లు కూడా ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులు పెట్టాయని గుర్తుచేశారు. వలంటీర్లు ఉద్యోగస్తులు మాత్రమేనని, వారికి పార్టీతో ఎలాంటి సంబంధమూ లేదన్నారు. మోదీకి చంద్రబాబు లవ్ లెటర్లు పంపుతున్నారని, మోదీ తిరస్కరిస్తున్నా.. పవన్‌కళ్యాణ్, సుజనాచౌదరితో రాయబారాలు నడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment