
సాక్షి, విజయవాడ: తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చిరస్మరణీయ వ్యక్తి ఎన్టీఆర్ అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ గొప్పతనం గుర్తించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు ఆయన పేరు పెట్టారని చెప్పారు. బుధవారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొడాలి నాని పూలమాలతో నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'నేటికీ అనేకమంది ఎన్టీఆర్ పేరు, ఫొటోలతో రాజకీయాలు చేస్తున్నారు. ఆయన తమకు ఆదర్శమంటూ నేడు కొందరు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఎన్టీఆర్ ఆదర్శమైతే, ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌ను క్షోభకు గురిచేసిన దొంగలను ఆయన అభిమానులు మట్టి కరిపించారు. పదవిని దొంగలించిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, అప్పటి నాయకులు నేటికీ ఎన్టీఆర్ పేరుతో ఓట్లు పొందుతున్నారు. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ జీవితం ఆదర్శం. గుడివాడ నుంచి రెండుసార్లు అన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం' అని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు.