
సాక్షి, విజయవాడ: పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గత ప్రభుత్వంలో చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నేడు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వల్లభనేని వంశీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మరం గర్వంగా ప్రతి గడపకు తిరుగుతున్నాం. సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందరికీ అందుతున్నాయి. అర్హతే ప్రాధాన్యంగా సచివాలయ వ్యవస్థ పనిచేస్తోంది. గ్రామాల్లో 90 శాతం ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమానంగా సాగుతోందని' తెలిపారు.
చంద్రబాబుకు లేని విద్యలేదని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ భవిష్యత్తు చెప్పేందుకు చంద్రబాబు జోతిష్యం నేర్చుకున్నాడా..? అని ప్రశ్నించారు. టీవీ, కంప్యూటర్, సెల్‌ఫోన్, హైదరాబాద్ కనిపెట్టిన చంద్రబాబు జోతిష్యం కూడా కనిపెట్టి ఉంటాడని ఎద్దేవా చేశారు. జనసేన లాంటి పార్టీలు కాలక్రమంలో చాలా రూపాంతరం చెందాయన్నారు. అలాంటి పార్టీల భవిష్యత్తు ప్రజలే నిర్ణయిస్తారు' అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు.
చదవండి: ('ఆయన ఉన్నంతకాలం టీడీపీ గుడివాడలో గెలిచే ప్రసక్తే లేదు')