సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో తన పాత్ర ఏమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. ఈ కేసులో బీజేపీ, కాంగ్రెస్ తనపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశాయని పేర్కొన్నారు. ‘రాజకీయ కుట్రలో పావును కాను. ధైర్యంగా కొట్లాడే పటిమ నాకు ఉంది’అని తేల్చిచెప్పారు. శని వారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిర్వహించిన ‘ఆస్క్ కవిత’కార్యక్రమంలో నెటిజన్లు రాజకీయ, వ్యక్తిగత అంశాలపై అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. తమకు రా జకీయ ప్రత్యర్థులతో ఎటువంటి డీల్ లేదని, తమది ‘టీమ్ తెలంగాణ’అని తేల్చిచెప్పారు.
బీఆర్‌ఎస్‌కు ఏ పార్టీతోనూ జట్టు లేదు...
తమకు ఏ పార్టీతో జట్టు లేదని, తెలంగాణ ప్రజలే తమ జట్టు అని కవిత స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో 100కుపైగా సీట్లలో గెలుస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు కేవలం సర్వేల్లోనే గెలుస్తాయని, తాము ఎన్నికల్లో గెలుస్తామన్నారు. బీజేపీ బీసీ సీఎం జపం ఎన్నికల గిమ్మిక్కేనని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీ నాయకత్వ బాధ్యతల నుంచి బీసీని తప్పించి అగ్రవర్ణాలకు అప్పగించారని, వాళ్లు బీసీ సీఎం అంటే ఎవరూ నమ్మరని కవిత చెప్పారు. బీసీల కులగణన చేయకుండా అడ్డుకుంటున్నది బీజేపీయేనని ఆమె ఆరోపించారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటును కేంద్రం పట్టించుకోవడం లేదని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని, మహిళా రిజర్వేషన్లను విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
తెలంగాణకు రాహుల్ కుటుంబం ద్రోహం
తెలంగాణతో తమకున్నది రాజకీయ బంధం కాదని.. కుటుంబ బంధమంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కవిత తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ తెలంగాణను బలవంతంగా ఆంధ్రతో కలపడం వల్ల 60 ఏళ్లు మోసపోయినట్లు చెప్పారు.
అలాగే రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ హయాంలో 1969లో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరాడుతున్న యువకులపై కాల్పులు జరపడంతో 369 మంది మరణించారని గుర్తుచేశారు. అలాగే రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ తెలంగాణకు చెందిన ఉమ్మడి రాష్ట్ర సీఎం అంజయ్యను అవమానించి ఆ పదవి నుంచి తప్పించారని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో దిగొచ్చి తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ 2009లో రాహుల్ తల్లి సోనియా గాంధీ ఆమె జన్మదినం సందర్భంగా ప్రకటించి మళ్లీ వెనక్కి వెళ్లడం వల్ల వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. రాహుల్ కుటుంబానికి తెలంగాణతో ఉన్న అనుబంధం పదేపదే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమేనని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment