సాక్షి, ముంబై: వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు (రెండో రోజు) గురువారం ఉదయం వాడివేడిగానే జరిగాయి. అయితే అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ వాతావరణాన్ని వేడెక్కించకుండా తగిన జాగ్రత్త తీసుకోవడంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగాయి. బుధవారం మొదటి రోజు ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గం అసెంబ్లీలో ఎదురుపడడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తిరుగుబాటు చేసిన శిందే వర్గీయులు, ఉద్ధవ్ ఠాక్రే మద్దతుదారుల మధ్య నమ్మక ద్రోహంపై కొద్దిసేపు మాటల వాగ్యుద్ధం జరిగింది.
దీంతో పరిస్ధితులు అదుపు తప్పకముందే అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ గత్యంతరం లేక సభా కార్యకలాపాలు ప్రారంభమైన కొద్ది సేపటికే గురువారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. గురువారం కూడా అదే పరిస్థితి నెలకొంటుందని అందరూ భావించారు. సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత అజిత్ పవార్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆరోగ్య శాఖ వైఫల్యాలను ఎండగడుతూ సంబంధింత మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సార్వజనిక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తానాజీ సావంత్‌కు తల తిరిగింది. సరైన సమాధానమివ్వడానికి తడబడ్డారు.
పాల్ఘర్ జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన గజవ్యాధిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని పాల్ఘర్ ఎమ్మెల్యే లేవనెత్తిన ప్రశ్నకు తానాజీ ధీటుగా సమాదానమిచ్చారు. కాని అజీత్ పవార్ పాల్ఘర్ జిల్లా ఆరోగ్య శాఖలో మొత్తం ఎన్ని పదవులు ఖాళీగా ఉన్నాయి. అందులో పూరించినవి ఎన్ని..? నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారు...? వివరాలు వెల్లడించాలని పవార్ అడిగిన ప్రశ్నకు తానాజీ స్పష్టంగా సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే విపక్షనేత ప్రశ్నలకు గంట తరువాత సమాధానమిస్తానని అందుకు గడువివ్వాలని కోరడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే గంట తరువాత కూడా ఆయన సమాధానం ఇస్తారనే నమ్మకం లేదని, దీనిపై సోమవారం చర్చిద్దామని స్పీకర్ చెప్పడంతో అందరు శాంతించారు.
నల్ల గడ్డం.. తెల్ల గడ్డంపై భుజబల్ వ్యంగ్యం...
అనంతరం ఎన్సీపీ నేత ఛగన్ భుజబల్ వస్తు సేవా పన్ను (జీఎస్టీ)పై ప్రశ్నల వర్షం కురిపించారు. జీఎస్టీని అడ్డుపెట్టుకుని అనేక చోట్ల దోపిడీ జరుగుతోందని ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర చరిత్రలో మొదటిసారి గడ్డం ఉన్న వ్యక్తి (పరోక్షంగా ఏక్‌నాథ్ శిందేను ఉద్ధేశించి) ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రభావం రాష్ట్రం వరకే పరిమితం ఉంది. కాని తెల్లగడ్డం ఉన్న వ్యక్తి (ప్రధానినుద్ధేశించి) ప్రభావం యావత్ దేశంలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రతీ వస్తువుపై జీఎస్టీ విధిస్తున్నారు. అదృష్టవశాత్తు మాపై జీఎస్టీ విధించడం లేదని వ్యంగ్యంగా అన్నారు. ఎక్కడ చూసినా జీఎస్టీ పేరుతో దోపిడీ జరుగుతోందని భుజబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసే ప్రతిపాదనలు, ప్రకటనలు చేస్తున్నారు. త్వరలో నిజం బయటపడుతుందన్నారు.
ధీటుగా స్పందించిన ప్రభుత్వం
గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న వారే నేడు మంత్రి పదవిలో కూర్చున్నారని జయంత్ పాటిల్ ఆరోపించారు. కాని అధికార పార్టీ మంత్రులు ధీటుగా సమాధానమిచ్చారు. సభ ప్రారంభానికి ముందు శిందే తమ వర్గం మంత్రులందరికీ ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానమివ్వాలని ఆదేశించారు. దీంతో ఎలాంటి జంకు లేకుండా ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానమిస్తున్న దృశ్యాలు నేడు అసెంబ్లీలో కనిపించాయి.
ఇరిగేషన్ డిపార్టుమెంట్ కుంభకోణంలో ఎన్సీపీకి చెందిన ఓ బడా నేత త్వరలో జైలుకు వెళతారని మోహితే కంబోజ్ చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై సభలో గందరగోళం నెలకొంది. కంబోజ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఆ తరువాత అందరు శాంతించడంతో సభా కార్యకలాపాలు తిరిగి ముందుకుసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment