నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఆదివారం జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో ఆర్జాలబావి గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 రౌండ్‌లలో లెక్కింపు పూర్తవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కోసం మొత్తం 75 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈవీఎంలు అందించేందుకు, ఇతర అవసరాలకు గాను 300 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. పూర్తి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వచ్చే అవకాశం ఉంది.
23 టేబుళ్ల ఏర్పాటు..: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం రెండు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈవీఎంలలో ఓట్లను లెక్కించేందుకు 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‌ను నియమించారు. ఒక్కో టేబుల్ మీద ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. అలా ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్ స్టేషన్ల ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
9 గంటల కల్లా తొలిరౌండ్ ఫలితం
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 686 లెక్కించిన తర్వాత అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను ఓపెన్ చేస్తారు. ఈవీఎంలను కౌంటింగ్ హాల్‌కు తీసుకొస్తారు. 21 టేబుళ్లమీద వాటిని లెక్కిస్తారు. మొదటి రౌండ్ ఫలితం 9 గంటలోపు రానుంది. గంటలో 4 రౌండ్లు లెక్కించే అవకాశం ఉండడంతో.. ఒంటి గంట వరకు మునుగోడు ఉప ఎన్నికల ఫలితం తేలిపోనుంది. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల బందోబస్తు మధ్య కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్, ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, రాహుల్‌శర్మ, రిటర్నింగ్ అధికారి రోహిత్‌సింగ్ పరిశీలించారు.
చదవండి:ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..?
Comments
Please login to add a commentAdd a comment