సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు అందిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. విచ్చలవిడిగా డబ్బులు, మద్యం, ఇతర తాయిలాలను పంపిణీ చేస్తున్నవారిపై, తీసుకున్నవారిపై ఐపీసీ సెక్షన్ 171(బీ) కింద కేసులు నమోదు చేయాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఎవరైనా అభ్యర్థిని/ఓటరును/ మరే ఇతర వ్యక్తిని బెదిరించినా, గాయపర్చినా సెక్షన్ 171(సీ) కింద కేసు పెట్టాలని సూచించింది. ఈ రెండు కేసుల్లో ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ నిబంధనలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఆదేశించింది. ఉప ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) వికాస్‌రాజ్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించారు.
మునుగోడుకు అదనంగా పరిశీలకులు
మునుగోడులో అక్రమ నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కేంద్రం ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఎన్నికల అదనపు పరిశీలకులుగా ఐఆర్‌ఎస్ అధికారి సుభోత్ సింగ్, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్ అధికారి సమత ముళ్లపూడిని తాజాగా నియమించింది. అక్రమ నగదు ప్రవాహం నియంత్రణలో వీరికి సహకరించేందుకు మరో ఏడుగురు ఆదాయ పన్నుశాఖ అధికారులను ఆ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్స్) మునుగోడుకు పంపించనున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.2.49 కోట్ల నగదు, 1,483.67 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వికాస్‌రాజ్ తెలిపారు. 36 మందిని అరెస్టు చేసి 77 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
(చదవండి: టీఆర్‌ఎస్‌లో ముసలం ఖాయం)
Comments
Please login to add a commentAdd a comment