ఖద్దరు బట్టల దర్పమే వేరు.. ధగ ధగా మెరుస్తూ..నిలబడి ఉండే ఖద్దరంటే అందరూ మోజు చూపిస్తారు. అయితే రాజకీయ నాయకులకు ఖద్దరు అనేది బ్రాండ్‌గా మారింది. కొందరైతే పండుగప్పుడో... ఏదైనా ఫంక్షన్‌కో ఖద్దరు ధరిస్తారు. నాయకులైతే ఎక్కువగా ఖద్దరులోనే కనిపిస్తారు. అయితే ఖద్దరు ధరించేవారికి ఉన్న డిమాండ్, విలువ ఇతరులకు ఉండదనేది వాస్తవం. ఇప్పుడు మునుగోడులోని అన్ని పార్టీల కార్యకర్తలు బీరువాలో దాచిన ఖద్దరు దుస్తులు బయటకు తీస్తున్నారట.
ఒక ఉప ఎన్నిక అనేక విచిత్రాలకు వేదికవుతోంది. అనేక రాజకీయ పరిణామాలకు దారి తీస్తోంది. భవిష్యత్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో రాజకీయ పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక ఓ పాఠంగా మారబోతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీల నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఆ నేతల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం కొందరు చోటామోటా నేతలు కూడా అదే స్థాయిలో కష్టాలు పడుతున్నారు. నేతల్ని ఆకట్టుకునేందుకు ఇన్నాళ్లు బీరువాల్లో దాచుకున్న తెల్లటి ఖద్దరు బట్టల్ని బయటకు తీస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు మునుగోడు రోడ్లపై ఎక్కడ చూసిన తెల్లటి ఖద్దరు ధగధగలే కనిపిస్తున్నాయి.
మునుగోడులో ఖద్దరు మెరవడానికి కూడా ఓ కారణం ఉందంటున్నారు. తెల్లటి బట్టలు వేసుకుని వెళ్తేనే లీడర్లం అని చెప్పుకోవడానికి అనువుగా ఉంటుందనే కారణం ఒకటైతే... ప్రస్తుత ఉప ఎన్నిక నేపథ్యంలో దర్పం ప్రదర్శించి నా వెనుక ఇన్ని ఓట్లు ఉన్నాయని..నేతల్ని నమ్మించాలన్నా నాలుగు రూపాయలు సంపాదించాలన్నా ఖద్దరే ముద్దు అనే ఆలోచనతో చోటా నేతలంతా ఖద్దరు బాట పట్టారు.
దీంతో మునుగోడులో ఎక్కడ చూసినా ఖద్దరు బట్టలు ధరించిన వారే కనిపిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని వస్త్ర దకాణాల్లో ఇప్పుడు తెల్లని ఖద్దరు వస్త్రాలకు గిరాకీ భారీగా పెరిగింది. మునుపెన్నడు లేని విధంగా ఖద్దరు కొనుగోళ్లు బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ దొరక్కపోతే పక్క ఊళ్ళ నుంచి ఖద్దరు తెప్పించుకుంటున్నారట.
మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు కత్తి మీద సాములా మారింది. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎత్తులు, పై ఎత్తులతో నాయకులు సతమతమవుతుంటే.. చోటామోటా లీడర్లు మాత్రం తమకు పైసలు వచ్చే టైమొచ్చిందని సంబరపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment