ఒక్క రూపాయి అవినీతి లేదు.. దేశమంతా అభివృద్ధే
నాడు కీలుబొమ్మ పీఎం..నేడు బలమైన పీఎం
కాంగ్రెస్ హయాంలో కల్లోలాలు, కుంభకోణాలే
మోదీ హ్యాట్రిక్ పీఎం ఖాయం
జూన్ 8 లేదా 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు
కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
మొయినాబాద్ రూరల్: దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ హ్యాట్రిక్ సాధిస్తారని, జూన్ 8 లేదా 9న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మోదీ హయాంలోనే దేశం సురక్షితంగా ఉందన్న ఆయన దేశంలో పదేళ్ల క్రితం నాటి, ప్రస్తుత పరిస్థితులపై ఆలోచన చేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో ఉగ్రవాద దాడులు, మతకల్లోలాలు జరిగేవని గుర్తుచేశారు. గతంలో కీలుబొమ్మలాంటి ప్రధాని ఉండేవారని.. మోదీ రాకతో దేశానికి బలమైన లీడర్ లభించారని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్ కన్వినర్ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటనే మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. పదేళ్ల క్రితం అనేక వస్తువులను మనం దిగుమతి చేసుకునే వారమని, ప్రస్తుతం మనమే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని వివరించారు.
కాంగ్రెస్ హయాంలో పదిహేను రోజులకో కుంభకోణం జరిగి రూ.వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని స్పష్టంచేశారు. ఆరి్టకల్ 370 రద్దు చేస్తామని చెప్పిన మోదీ చేసి చూపించారన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆయనతోనే సాధ్యమైందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిన్నా రాజ్యాంగమే వస్తుందని విమర్శించారు.
రుణమాఫీకి రేవంత్ డబ్బులెక్కడి నుంచి తెస్తారో?
డిసెంబర్‌లో రుణమాఫీ చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి అందుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉచితంగా బస్సుల్లో తిప్పితే అన్నీ ఇచ్చినట్లు అనుకోవద్దని ప్రజలకు సూచించారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యరి్థ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాశ్, సనివెళ్లి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మరెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, ఆయా నియోజకవర్గాల బూత్ లెవల్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment