గ్యాస్ ధరలపై నిరసన తెలుపుతున్న మమత
సిలిగురి/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. వారిద్దరూ అతిపెద్ద దోపిడీదారులని ధ్వజమెత్తారు. మోదీ, అమిత్ షా హయాం సిండికేట్‌మయంగా మారిందన్నారు. వారిద్దరి పర్యవేక్షణలోనే డబ్బు యథేచ్ఛగా చేతులు మారుతోందని ఆరోపించారు. బెంగాల్‌లో అసలైన పరివర్తన్(మార్పు) రావాలంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. పరివర్తన్ బెంగాల్‌లో కాదు, ఢిల్లీలో వస్తుందని స్పష్టం చేశారు.
ఎల్పీజీ ధరల పెరుగుదలకు నిరసనగా బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఆమె ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మోదీ ఉత్తుత్తి హామీలతో మోసం చేస్తున్నారని, ఆయనను జనం ఇక నమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా డబ్బు ఎలా వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి, ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ సొమ్మును ఇంకా ఎందుకు డిపాజిట్ చేయలేదని నిలదీశారు. మోదీ చెప్పే కల్ల బొల్లి కబుర్లను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. పెరుగుతున్న ధరలతో వంట గ్యాస్‌కు సామాన్య ప్రజలు దూరమవుతున్నారని అన్నారు.
జేపీకి బుద్ధి చెప్పాలి
అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్నందుకు మోదీ సిగ్గుపడాలని మమత అన్నారు. ఆయన బెంగాలీ భాషలో ప్రసంగిస్తుంటారని, స్క్రిప్టును మాత్రం గుజరాతీలో రాసుకుంటారని ఎద్దేవా చేశారు. బెంగాల్‌కు గురించి, ఇక్కడి సంస్కృతి గురించి మోదీకి ఏం తెలుసని ప్రశ్నించారు. అధికారమే లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు చేస్తోందని, మతం, భాష అంటూ చీలికలు తెస్తోందన్నారు. కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతుగా ప్రచారం చేయాలని మమత, జార్ఖండ్ సీఎం హేమంత్‌కు విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ మూలాలున్న ప్రజలు బెంగాల్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి ఓట్లపై తృణమూల్ కాంగ్రెస్ గురిపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment