తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్థులకు అందని విధంగా తమదైన రీతిలో ప్రజల వద్దకు వెళ్లడానికి నాయకులు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ అధికార పీఠమే లక్ష‍్యంగా పావులు కదుపుతోంది. నియోజక వర్గాల స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
రాష్ట్రంలో అధికార పార్టీకి ధీటుగా బదులు చెప్పగల సరైన ప్రత్యామ్నయం తామే అని చెప్పుతున్న బీజేపీ.. ఈ సారి ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించనుంది. ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీ నుంచి పర్యటనలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 119 నియోజక వర్గాలకు 119 మంది ఎమ్మెల్యేలు ఈ మేరకు పర్యటన చేయనున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యేలు వారం రోజుల పాటు పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
ఒక్కో ఎమ్మెల్యే తమకు కేటాయించిన నియోజక వర్గంలో వారం రోజుల పాటు పర్యటించి, స్థానిక నాయకులను కలవనున్నారు. బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక అంశాలపై రిపోర్టును తీసుకుని అధిష్ఠానానికి సమర్పించనున్నారని సమాచారం.
ఇదీ చదవండి: మోదీని కలవనున్న బండి సంజయ్.. ఏ రాష్ట్రం ఇస్తారో?
Comments
Please login to add a commentAdd a comment