‘గులాబీ’ రెక్కలే గెలుపు గుర్రాల వేటలో వలస నేతలకు ప్రాధాన్యం
రెండు జాతీయ పార్టీల అభ్యర్థుల్లో 18 మందిలో ‘గులాబీ రంగు’
బీజేపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి ఆరుగురు బీఆర్‌ఎస్ నేపథ్యమున్నవారే..
బీఆర్‌ఎస్‌లోనూ ఐదుగురు అభ్యర్థులకు కాంగ్రెస్ మూలాలు
అభ్యర్థుల కొరత, ఆర్థిక బలం, సామాజిక వర్గాల లెక్కల వల్లే..
(కల్వల మల్లికార్జున్‌రెడ్డి) : మరో నెలరోజుల్లో రాష్ట్రంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలు ఇప్పటికే ఖరారు చేశాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ ఇప్పటికే 17 నియోజకవర్గాలకూ అభ్యర్థులను ప్రకటించగా, అధికార కాంగ్రెస్ మాత్రం మరో మూడుచోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే అభ్యర్థుల ఎంపికలో ఈసారి అన్ని పార్టీలు విచిత్ర పద్ధతులను అనుసరించగా, అభ్యర్థులు కూడా టికెట్ దక్కించుకునేందుకు విచిత్ర విన్యాసాలు చేశారు. దీంతో ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరి పోటీ చేస్తున్నారో తెలియని అయోమయ స్థితి నెలకొంది.
పార్టీ సిద్ధాంతాలు, విధానాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులుగా పేర్కొంటూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ల కేటాయింపులో పెద్దపీట వేశాయి. పార్టీలో సీనియారిటీ, విధేయత వంటి వాటిని పక్కనపెట్టి వలస నేతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాయి. సొంత పార్టీలో సమర్థులైన అభ్యర్థులు లేరనే సాకుతో ఆర్థిక బలం, కుటుంబ నేపథ్యం, సామాజికవర్గాల లెక్కలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేశాయి.
మరోవైపు ఇన్నాళ్లూ కొనసాగుతున్న పార్టీలో పోటీ అవకాశం దక్కినా కాలదన్ని మరీ ప్రత్యర్థి పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న ఘటనలూ ఉన్నాయి. దీంతో పార్టీలు, అభ్యర్థులు ఎవరైనా ఒకరిద్దరు మినహా మిగతా వారందరూ ఏదో ఒక సందర్భంలో బీఆర్‌ఎస్‌లోనో.. కాంగ్రెస్‌లోనో కొనసాగిన వారే కావడం ఆసక్తికరం.
అన్ని పార్టీల్లోనూ ‘గులాబీ’ గుబాళింపు
రాష్ట్రంలోని 17 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 మంది ఏదో ఒక సందర్భంలో బీఆర్‌ఎస్‌లో పనిచేసిన వారే ఉన్నారు. బీజేపీలో 12 మంది, కాంగ్రెస్‌లో ఆరుగురు లేదా వారి కుటుంబ సభ్యులు బీఆర్‌ఎస్‌లో కొనసాగిన వారే. బీఆర్‌ఎస్ ప్రకటించిన 17 మంది అభ్యర్థుల్లోనూ ఆరుగురు కాంగ్రెస్ జీన్స్ కలిగిన వారున్నారు. పెద్దపల్లి, వరంగల్, చేవెళ్ల, మల్కాజిగిరి, మెదక్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గతంలో బీఆర్‌ఎస్‌లో పనిచేసిన వారే కావడం గమనార్హం.
నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్ (బీజేపీ), పెద్దపల్లిలో గడ్డం వంశీ (కాంగ్రెస్), వరంగల్‌లో కడియం కావ్య (కాంగ్రెస్), నాగర్‌కర్నూలులో పి.భరత్ (బీజేపీ) బరిలో ఉన్నారు. వీరి తండ్రులు గతంలో బీఆర్‌ఎస్‌లో కీలక పదవులు అనుభవించిన వారు కావడం గమనార్హం. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే వినోద్‌కు మూడు పార్టీల్లోనూ పనిచేసిన అనుభవం ఉంది.
♦ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో గోడెం నగేశ్ (ఆదిలాబాద్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి), ఆరూరు రమేశ్ (వరంగల్), సీతారాం నాయక్ (మహబూబాబాద్), బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి), శానంపూడి సైదిరెడ్డి (నల్లగొండ), పి.భరత్ (నాగర్‌కర్నూలు), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), ఎం.రఘునందన్‌రావు (మెదక్), బీబీ పాటిల్ (జహీరాబాద్) గతంలో బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసిన వారే.
♦ కాంగ్రెస్ తరపున టికెట్లు దక్కిన గడ్డం వంశీ (పెద్దపల్లి), కడియం కావ్య (వరంగల్), పి.రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), నీలం మధు (మెదక్), దానం నాగేందర్ (సికింద్రాబాద్), పట్నం సునీత మహేందర్‌రెడ్డి (మల్కాజిగిరి) గతంలో బీఆర్‌ఎస్‌తో సంబంధాలు కలిగిన వారే.
♦ బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్), మాలోత్ కవిత (మహబూబాబాద్), క్యామ మల్లేశ్ (భువనగిరి), రాగిడి లక్ష్మారెడ్డి (మల్కాజిగిరి), గాలి అనిల్ కుమార్ (జహీరాబాద్) కూడా ఎంతో కొంత కాంగ్రెస్ వాసన కలిగిన వారే.
సిట్టింగుల్లో 9 మందే తిరిగి బరిలోకి..
17 మంది సిట్టింగ్ ఎంపీల్లో 9 మంది మాత్రమే తిరిగి బరిలోకి దిగుతున్నారు. వీరిలో బీఆర్‌ఎస్ నుంచి 9 మందికిగాను ముగ్గురు, బీజేపీలో నలుగురికిగాను ముగ్గు రు తిరిగి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌లో మాత్రం ముగ్గురు సిట్టింగుల్లో ఒక్కరూ తిరిగి పోటీ చేయడం లేదు. బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), బండి సంజ య్ (కరీంనగర్), బీబీ పాటిల్ (జహీరాబాద్), కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బీఆర్‌ఎస్ నుంచి మాలోత్ కవిత (మహ బూబాబాద్), నామా నాగేశ్వర్‌రావు (ఖమ్మం), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), కాంగ్రెస్ నుంచి రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం– హైదరా బాద్) తిరిగి పోటీ చేస్తున్నారు.
సిట్టింగ్ ఎంపీలు సోయం బాపూరావు (ఆదిలాబాద్), వెంకటేశ్ నేత (పెద్దపల్లి) పసునూరు దయాకర్ (వరంగల్), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (భువనగిరి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ), పి.రా ములు (నాగర్‌కర్నూలు), రేవంత్‌రెడ్డి (మల్కాజి గిరి), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్) పోటీకి దూరంగా ఉన్నారు. వెంకటేశ్ నేత, దయాకర్ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినా టికెట్ దక్కలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన రేవంత్‌రెడ్డి సీఎంగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి మంత్రులు గా ఉండగా, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా రు. నాగర్‌కర్నూలు ఎంపీ పి.రాములు బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరి తన కుమారుడు పి.భరత్ కు టికెట్ ఇప్పించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment