ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు అభ్యర్థుల తంటాలు ఎన్నికల ఖర్చు కోసం దొరికిన చోటల్లా అప్పు చేసేవారు కొందరైతే... భూములు, ఆస్తులు అమ్ముతున్నవారు మరికొందరు ఉన్నారు. ఎలాగైనా గెలవాలనే భావనతో ఖర్చు ఎంత అయినా సరే అంటూ బరిలో ఉంటున్నారు.
ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ప్రధాన పార్టీ అభ్యర్థి.. చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఏం వెనకేసుకున్నాడో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి తెలిసినవారిని, పరిచయం ఉన్నవారిని కలుస్తూ.. కాస్త డబ్బులు సర్దాలంటూ కోరుతున్నారు. చేబదులుగానే కాదు భూమిని తాకట్టు పెట్టి, అప్పులు చేసి మరీ ఎన్నికల ఖర్చు కోసం వీలైనంత సొమ్మును రెడీ చేసుకుంటున్నారు. ‘‘నా దగ్గర ఉన్న డబ్బుకు తోడు అక్కడా ఇక్కడా మరింత సర్దుబాటు చేసుకుంటున్నాను. అవసరం మనది. నానా రకాల పత్రాల మీద సంతకాలు చేయించుకోనిదే ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదు..’’ అని సదరు అభ్యర్థి పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే ఆయన.. ఎన్నికల ఖర్చు కోసం ఇటీవలే తన భూమిని అమ్మేశారు. గతంలో ఇతరులకు అప్పుగా, చేబదులుగా ఇచ్చి న సొమ్మును తిరిగి వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. ‘‘ఎన్నికల్లో పోటీ ఎక్కువై, ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. భూమిపోతే మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవకపోతే.. ఐదేళ్లదాకా ఆగాల్సిందే. అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. దొరికిన చోటల్లా డబ్బు సిద్ధం చేసుకుని అయినా ఈసారి గట్టెక్కాల్సిందే..’’ అని సదరు ఎమ్మెల్యే అంటున్నారు.
... ఇలా ఈ ఇద్దరే కాదు, ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులందరిదీ ఇదే మాట. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నవారి నుంచి కొత్తగా బరిలోకి దిగుతున్న వారి వరకు ఇదే వరుస. ముందు జాగ్రత్తగా ఇప్పటికే సొమ్ము రెడీ చేసుకుంటున్నవారు కొందరు.. పార్టీల నుంచి టికెట్ ఖరారుకాగానే బరిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్నవారు మరికొందరు. స్వతంత్రులుగానో, ఏదైనా చిన్న పార్టీ నుంచో పోటీ చేయడానికి సిద్ధమైనవారు ఇంకొందరు.. ఎవరిని కదిలించినా ఆఫ్ ది రికార్డుగా ‘ఖర్చు’ కష్టాలను ఏకరవు పెడుతున్నారు.
సమయం దగ్గరపడుతుండటంతో..: బీఆర్‌ఎస్
తరఫున మెజారిటీ ఎమ్మెల్యేలే మళ్లీ బరిలోకి దిగుతున్నారు. బీ–ఫారాలు కూడా అందుకుని ప్రచారమూ ముమ్మరం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రెండు జాబితాలు విడుదల చేసింది. బీజేపీ కూడా 53 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. ఇప్పటికే టికెట్లు ఖరారైనవారు దూకుడుగా ముందుకు వెళ్తుండగా.. టికెట్ కచ్చి తంగా దక్కుతుందన్న భరోసా ఉన్నవారూ ‘ఖర్చు’ మొదలుపెట్టేశారు.
ఇక టికెట్ ఆశిస్తున్నవారూ అస్త్రశ్రస్తాలను సిద్ధంగా పెట్టుకుంటున్నారు. అంతా డబ్బు సమీకరణ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎంత ఖర్చవుతుంది, ఎంత సమకూరింది, ఇంకా ఎంత అవసరమనే లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల కోడ్, తనిఖీల నేపథ్యంలో ఎక్కడికక్కడే నమ్మకస్తులు, అనుచరుల వద్ద డబ్బును సిద్ధంగా పెట్టి.. ఏయే సమయంలో, ఏ ఖర్చులకు వాడాలో సూచిస్తున్నారు.
- గౌటే దేవేందర్
Comments
Please login to add a commentAdd a comment