
పంజాబ్‌లో గత నాలుగు అసెంబ్లీ ఎన్నికలను పరిగణనలోకి తీసుకొని చూస్తే 35 శాతానికి మించి ఓట్లు సాధించిన పార్టీయే అధికార పీఠాన్ని అందుకుంటోంది.
పంజాబ్‌లో గత నాలుగు అసెంబ్లీ ఎన్నికలను పరిగణనలోకి తీసుకొని చూస్తే 35 శాతానికి మించి ఓట్లు సాధించిన పార్టీయే అధికార పీఠాన్ని అందుకుంటోంది. సంప్రదాయ ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకొని చూస్తే... అందరికంటే కాంగ్రెస్ బాగా బలంగా కనపడుతోంది. నాలుగు అసెంబ్లీ ఎన్నికల సగటును తీసుకుంటే కాంగ్రెస్‌కు 39.57 శాతం ఓట్లున్నాయి. 2007, 2012లో అకాలీదళ్– బీజేపీ కూటమి వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చినా... ఈ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే అత్యధికంగా 40 శాతం పైచిలుకు ఓట్లు పడటం గమనార్హం. అయితే నిత్య అసంతృప్త వాది, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూ సొంత పార్టీపైనే ఇప్పటికీ బౌన్సర్లు విసురుతున్నారు. సీఎం అభ్యర్థిగా చన్నీని ప్రకటిస్తే... సిద్ధూ స్పందన తీవ్రంగా ఉంటుంది. కాడి పడేసి.. వెళ్లిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కాంగ్రెస్ సగటున 39.57 ఓటు శాతంతో కాగితంపై పోటీదారులందరిలోకి బలంగా కనపడుతోంది. అయితే కాంగ్రెస్ తరఫున రెండుసార్లు... దాదాపు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇప్పుడు పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు పర్యాయపదంగా మారిన అమరీందర్ కాంగ్రెస్ సంప్రదాయక ఓట్లలో నుంచి ఎంతోకొంత లాగడం ఖాయం. కెప్టెన్ కనీసపక్షం 4 నుంచి 5 శాతం ఓట్లు లాగినా... కాంగ్రెస్ పుట్టి ముంచగలరు.
పంజాబ్‌లో దేశంలోనే అత్యధికంగా 32 శాతం దళిత ఓటర్లు ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ దళితుడైన చరణ్‌జిత్‌సింగ్ చన్నీని గత ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రిని చేసింది. గురు రవిదాస్ జయంతి ఉన్నందువల్ల ఎన్నికలను వాయిదా వేయాలని అందరికంటే ముందు ఈసీని కోరి... ఎన్నికలు ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదాపడటంలో ముఖ్యభూమిక పోషించిన చన్నీ తమ సామాజికవర్గంలో సానుకూలతను పెంచుకున్నారు.
చదవండి: (తగ్గేదేలే..! తొలిసారి అసెంబ్లీ బరిలోకి సీఎం యోగి ఆదిత్యనాథ్)
అయితే కాంగ్రెస్ ఇంటిపోరు ఏరూపం తీసుకుంటుందో, అధిష్టానాన్ని కూడా లెక్కచేయకుండా మాట్లాడుతున్న సిద్ధూ ఎప్పుడే మంట రాజేస్తారో ఊహించడం కష్టం. మరోవైపు శిరోమణి అకాలీదళ్ విశ్వసనీయత దెబ్బతింది. గతంలో పదేళ్లు (2007–2017) అధికారంలో ఉన్నపుడు సిక్కుల పవిత్రగ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్‌ను అవమానపర్చిన ఘటనలో కఠినంగా వ్యవహరించకపోవడం, పంజాబ్ డ్రగ్స్‌కు అడ్డాగా మారడం, ఇసుక మాఫియా... లాంటివి అకాలీదళ్‌పై ప్రజా వ్యతిరేకతను బాగా పెంచాయి. గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న 15 సీట్లలో నెగ్గి మూడోస్థానంలో నిలిచింది. గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్ సగటు ఓటుశాతం 34.40గా ఉంది. అయితే బీజేపీతో పొత్తు ఉండేది.
గత నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల గ్రాఫ్ (ఓట్లశాతం, సీట్లు)
ఇప్పుడు బీజేపీ... కాంగ్రెస్‌ను వీడి సొంతకుంపటి పెట్టుకున్న మాజీ సీఎం, కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో జట్టు కట్టడం, కొత్తగా ఎస్‌ఎస్‌ఎం కూడా బరిలోకి దిగుతున్నందువల్ల రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. అకాలీదళ్ ఓటు శాతం తగ్గుతుంది. ఆప్ కిందటి ఎన్నికల్లో 23,72 శాతం ఓట్లు సాధించింది. అధికార పీఠం అందాలంటే కనీసపక్షం మరో 10 శాతం (పంచముఖ పోరు కాబట్టి) ఓట్లు రావాలి. తటస్థ ఓటర్లపై ఆశలు పెట్టుకొని ఈసారి అధికారం మాదేనన్న ఉత్సాహంతో చాలాకాలంగా ఆప్ పంజాబ్‌లో గట్టిగా పనిచేస్తోంది. ఇప్పుడు ఎస్‌ఎస్‌ఎం బరిలోకి దిగేసరికి... ఆప్‌కు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఆప్ అధినేత సైతం ఈ పరిణామం కచ్చితంగా తమకు నష్టం చేసేదేనని బాహటంగానే అంగీకరించారు. ఎన్నికలు సమీపించిన కొద్దీ పంజాబ్‌లోని సామాజికవర్గాల రాజకీయ పునరేకీకరణ ఏరూపు తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుత పరిస్థితులే పోలింగ్ నాటికీ ఉంటే మాత్రం ఆప్‌కు దెబ్బపడుతుంది. – నేషనల్ డెస్క్, సాక్షి
చదవండి: (Punjab Assembly Election 2022: ఆప్‌కు ముప్పు: విజయావకాశాలను దెబ్బతీసేలా)