( ఫైల్ ఫోటో )
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో ఎప్పుడు ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. తిరుపతి లోక్‌సభ ఎన్నిక, బద్వేలు శాసనసభ ఉపఎన్నికల్లో బాధ్యత తీసుకుని ఏకపక్ష విజయాలను అందించిన ట్రాక్ రికార్డు ఆయనది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి వరుసగా ఏకపక్ష విజయాలను అందిస్తూ వచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికకు పెద్దాయన తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కూడా తోడయ్యారు.
ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెద్దిరెడ్డి గత కొంతకాలంగా విస్తృతంగా పర్యటించారు. దీంతో పాటు తిరుపతి వేదికగా జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సమావేశ నిర్వహణ చూస్తూనే కుప్పం ఎన్నికల బాధ్యతను పర్యవేక్షించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు పెద్దిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగతంగానూ తూలనాడారు. అయినా సరే సంయమనం పాటించారు. ఆ సందర్భంలోనే బాబు వ్యాఖ్యలపై స్పందించాలని పెద్దిరెడ్డిని మీడియా కోరగా ఇప్పుడేమీ మాట్లాడనని, కుప్పంలో గెలిచిన తరువాతే మాట్లాడుతానని స్పష్టం చేశారు.
బాబు విమర్శలకు దీటుగా ప్రచార ఉధృతిని పెంచి ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కుప్పంవాసులకు జరిగిన మేలును వివరించారు. మరోవైపు మిథున్‌రెడ్డి కుప్పంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భరత్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. చేతికి గాయమైనప్పటికీ ఆసుపత్రి నుంచి నేరుగా కుప్పం ప్రచారంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కొంతకాలంగా కుప్పంలో ఉంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆత్మస్ఖైర్యం నింపారు. చంద్రబాబు, లోకేష్‌లు కార్యకర్తలను రెచ్చగొట్టి వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు చేయించారు.
అయితే వైఎస్సార్‌సీపీ శ్రేణులు డీలా పడకుండా ఎక్కడికక్కడ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. ఫలితంగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మొత్తంగా తండ్రి, తనయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతల సమష్టి కృషితో కుప్పంలో అరుదైన విజయం నల్లేరు మీద నడకలా సాగడం విశేషం.
బాబు పతనం ఇలా..
► 1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన బాబు 2019 వరకు గెలుస్తూ వస్తున్నారు.
► తొలిసారిగా 6,918 ఓట్ల మెజారిటీ సాధించిన బాబు.. 1994, 1999లో 60 శాతం వరకు మెజారిటీ సాధించారు.
► 2004లో 42 శాతం, 2009లో 46 శాతం మెజారిటీ వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ 28 శాతానికి పడిపోయింది.
► 2019లో జరిగిన ఎన్నికల్లో 30వేల ఓట్ల తేడాతో కేవలం 16 శాతం మెజారిటీ.
► తాజా స్థానికసంస్థల ఎన్నికల్లో శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం జెడ్పీటీసీలను, ఎంపీపీలను, 62 ఎంపీటీసీ, 74 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీని చావుదెబ్బ కొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment