
సాక్షి, యాదాద్రి, జనగామ: ప్రతి పేదవాడికి ఇల్లు కావాలని.. వైట్‌హౌజ్ లాంటి బంగ్లాలు కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో అద్భుతంగా ఉండే పాలకుల ప్యాలెస్ కోసం తెలంగాణ తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదివారం 45వ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లా సరిహద్దు ఆలేరు మండలంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
సాయంత్రం ప్రారంభమైన పాదయాత్ర శ్రీనివాసపురం, పటేల్‌గూడెం, గుండ్లగూడెం మీదుగా ఆలేరు పట్టణానికి చేరుకుంది. ఆలేరులోని రైల్వేగేట్ వద్ద టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య అధ్యక్షతన జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సంపద మొత్తం 4 కోట్ల మంది ప్రజలకు సమానంగా పంచుకోవడానికి తెచ్చుకుంటే దురదృష్టవశాత్తూ కేసీఆర్ కుటుంబంతో పాటు వారితో మమేకమైన వారు దోచుకుతింటున్నారని ఆరోపించారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే ఆరుట్ల కమలాదేవి ఈ ప్రాంతంలో భూములు పంచితే బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సునీతకు ప్రజల మీద కంటే భూములపైన, వెంచర్లపైన, భూకబ్జాలపైన ప్రేమ ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె. నగేష్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త సచివాలయం వల్ల ప్రజలకు ప్రయోజనమేమిటి?
పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకలి కేకలు పట్టించుకోకుండా.. ఇళ్లు లేక ప్రజలు, ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతుంటే ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థి, నిరుద్యోగుల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment