బెంగాల్‌లో సిండికేట్‌ రాజ్యం | PM NARENDRA Modi attacks Mamata over cut money | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో సిండికేట్‌ రాజ్యం

Published Tue, Feb 23 2021 2:35 AM | Last Updated on Wed, Feb 24 2021 7:58 PM

PM NARENDRA Modi attacks Mamata over cut money - Sakshi

హూగ్లీ జిల్లాలో సభలో ప్రసంగిస్తున్న మోదీ

చుచుర(పశ్చిమబెంగాల్‌)/ధెమాజి(అస్సాం): అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు పెంచారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అధికార పార్టీ ఆధ్వర్యంలో సిండికేట్‌ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఆ సిండికేట్‌కు ‘కట్‌ మనీ’ చెల్లించకుండా సామాన్యులకు ఏ పనీ కావడం లేదన్నారు. ‘చివరకు ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా.. ఇల్లు అద్దెకు ఇవ్వాలన్నా కట్‌ మనీ ఇవ్వాల్సిందే. సిండికేట్‌ అనుమతి లేకుండా ఏ పనీ కాదు’అని విమర్శించారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రముఖులను, సాంస్కృతిక వారసత్వాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

సురక్షిత తాగు నీటిని అందించే కేంద్ర ప్రభుత్వ ‘జల్‌జీవన్‌’పథకాన్ని కూడా రాష్ట్రంలో సరిగ్గా అమలు చేయకుండా రాష్ట్రంలోని మహిళలను ఇబ్బందులు పెడ్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలుకాకుండా అడ్డుకుని రైతులకు, పేదలకు వాటి ప్రయోజనాలు లభించకుండా చేశారని ఆరోపించారు. హూగ్లీ జిల్లాలో ఒక బహిరంగ సభను ఉద్దేశించి సోమవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ పర్యటన సందర్భంగా నొవాపాడా నుంచి దక్షిణేశ్వర్‌ వరకు మెట్రో రైలు ఎక్స్‌టెన్షన్‌తో పాటు పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. దక్షిణేశ్వర్‌లో 160 ఏళ్ల నాటి ప్రఖ్యాత కాళీ మాత ఆలయం ఉంది. స్వయం సమృద్ధ భారత్‌కు పశ్చిమబెంగాల్‌ చాలా కీలకమైన కేంద్రమని ప్రధాని పేర్కొన్నారు.

అస్సాంను అభివృద్ధి చేయలేదు
గతంలో అస్సాంను పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోదీ విమర్శించారు. అస్సాంను, ఈశాన్య రాష్ట్రాలను దశాబ్దాల తరబడి గాలికి వదిలేశాయని మండిపడ్డారు. అస్సాంలో సోమవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.  ‘స్వాతంత్య్రం అనంతరం దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన వారు దిస్పూర్‌ ఢిల్లీకి చాలా దూరమని భావించారు. కానీ ఇప్పుడు ఢిల్లీ దూరంలో లేదు. మీ దర్వాజా ముందే ఉంది’అని ధెమాజి జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం మార్చి 7వ తేదీలోపు ప్రకటించే అవకాశముందని ప్రధాని సంకేతాలిచ్చారు. ‘ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 7లోపు ప్రకటిస్తారని నేను అంచనా వేస్తున్నా’అని అన్నారు. ప్రధాని అస్సాంలో పర్యటించి రూ. 20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.

‘రక్షణ’ తయారీపై నిర్లక్ష్యం
రక్షణ రంగ పరికరాల తయారీలో భారత్‌ వేగంగా సామర్థ్యాలను పెంచుకుంటోందని మోదీ అన్నారు. స్వాతంత్య్రానికి ముందే భారత్‌లో వందలాది ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయని, ప్రపంచ యుద్ధాల సమయంలో ఆ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల ఎగుమతి జరిగిందని గుర్తు చేశారు. తదనంతర కాలంలో, వాటిని పట్టించుకోలేదని, వాటిని బలోపేతం చేసేందుకు కృషి చేయలేదని విమర్శించారు. రక్షణ రంగానికి తాజా బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల సమర్థ వాడకంపై వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement