వర్షం పడుతుండటంతో పార్లమెంట్‌కు గొడుగుతో వస్తున్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాసమస్యలపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలిరోజు స్తంభించిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, కోవిడ్ కట్టడి వైఫల్యాలపై కాంగ్రెస్, ఇతర పక్షాలు సోమవారం ఉభయ సభల్లో ఆందోళన చేపట్టాయి. లోక్‌సభలో పోలవ రం ప్రాజెక్టుకు నిధుల అంశంపై, రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ప్రధాని మోదీ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులను పరిచయం చేసేందుకు లేచి నిలబడగానే లోక్‌సభలో విపక్షాలు తమ ఆందోళన ప్రారంభించాయి. దాం తో, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని అర్ధంతరం గా ముగించాల్సి వచ్చింది. విభిన్న అంశాలపై చర్చ కు పట్టుబట్టుతూ నోటీసులు ఇచ్చిన పలు విపక్ష పా ర్టీల సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేయడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదాపడ్డాయి.
ప్రధాన మంత్రికీ తప్పని నిరసన సెగ
విపక్షాల ఆందోళనల మధ్య మంత్రులను పరిచయం చేయకుండానే ప్రధాన మంత్రి లోక్‌సభలో అర్ధాంతరంగా తన ప్రసంగం ముగించాల్సి వచ్చింది. ప్రధాన మంత్రి కొత్త మంత్రులను సభకు పరిచయడం చేయడం సంప్రదాయంగా వస్తోంది. సోమవారం వర్షకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాన మంత్రి తన నూతన మంత్రివర్గ సహచరులను ఉభయ సభలకు పరిచయం చేయాలని ప్రయత్నించగా విపక్షాలు నిరసనలతో అడ్డుపడ్డాయి. దీంతో ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని కొద్ది సేపట్లోనే ముగించారు. ఈ సందర్భంగా విపక్షాల వైఖరిని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో స్పందిస్తూ ‘కాంగ్రెస్ ప్రవర్తన విచారకరం. దురదృష్టకరం. ఈ ధోరణి అనారోగ్యకరమైనది’అని వ్యాఖ్యానించారు. విపక్ష సభ్యుల ఆందోళనతో సభాపతి ఓంబిర్లా నేరుగా మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్‌సభను వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైనప్పటికీ రెండు నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి 3.30 గంటలకు ప్రారంభమై 8 నిమిషాల పాటు మాత్రమే కొనసాగి మంగళవారానికి వాయిదాపడింది. మరోవైపు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు సమావేశాలకు సైకిళ్లపై వచ్చారు. ఇంధన ధరల పెరుగుదలపై సభలోనూ ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు మద్దతుగా శిరోమణి అకాలీదళ్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కొందరికి బాధగా ఉంది: ప్రధాని మోదీ
పార్లమెంట్లో విపక్షాల వైఖరిని ప్రధాని మోదీ తప్పుబట్టారు. ఇలాంటి వ్యతిరేక వైఖరిని పార్లమెంట్లో ఎన్నడూ చూడలేదన్నారు. గ్రామీణ నేపథ్యం ఉన్నవారు, దళితులు, ఓబీసీలు, మహిళలు పెద్ద సంఖ్యలో మంత్రులు కావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. తన ప్రసంగాన్ని ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడంపై స్పందిస్తూ.. ‘అధ్యక్షా.. కేబినెట్‌లోని కొత్త సభ్యులను ఈ సభకు పరిచయం చేయాలని మీరు నన్ను ఆదేశించారు.
దేశ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన రైతు కుటుంబాలకు చెందిన వారు మంత్రులు కావడం ద్వారా ఈ సభకు పరిచయం అవుతున్నప్పుడు కొంతమంది చాలా బాధపడుతున్నారు. ఈ రోజు ఈ సభలో మంత్రులుగా మారిన మహిళలను పరిచయం చేస్తుంటే.. వారిని పరిచయం చేసుకునేందుకు కూడా విపక్షాలు సిద్ధంగా లేవు. మహిళా వ్యతిరేక మనస్తత్వం వారిలో ఉంది. మహిళల పేరు వినడానికి కూడా సిద్ధంగా లేరు. షెడ్యూల్ తెగకు చెందిన మన ఎంపీలు పెద్ద సంఖ్యలో మంత్రులుగా మారారు. ఈ సభలో గిరిజన మంత్రులను పరిచయం చేయడం కూడా వారికి ఇష్టం లేదు. మన గిరిజనుల పట్ల వారికి అలాంటి కోపం ఉంది. ఈ సభలో పెద్ద సంఖ్యలో దళిత మంత్రులు వచ్చారు. దళిత సమాజం ప్రతినిధుల పేర్లు వినడానికి విపక్షాలు సిద్ధంగా లేవు.
ఇది ఎలాంటి మానసిక స్థితి. దళితులను గౌరవించడానికి, రైతు బిడ్డలను గౌరవించడానికి సిద్ధంగా లేని ఈ మనస్తత్వం ఏమిటి? మహిళలను గౌరవించటానికి సిద్ధంగా లేని ఈ మనస్తత్వం ఏమిటి? ఈ రకమైన వికృత మనస్తత్వాన్ని సభ మొదటిసారి చూసింది’అని విమర్శించారు. రాజ్యసభ మొత్తం నాలుగుసార్లు వాయిదాపడింది. వివిధ అంశాలపై చర్చించేందుకు రాజ్యసభలో నిబంధన 267 కింద 17 నోటీసులు వచ్చాయని, ఏపీకి ప్రత్యేక హోదా సహా అన్ని అంశాలు చర్చించదగినవేనని, అయితే ఇతర సందర్భాల్లో వాటిని చర్చించవచ్చని చెబుతూ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు వాటిని తిరస్కరించారు. కొత్తగా సహాయ మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి బంగ్లాదేశీయుడని పేర్కొంటూ, ఆ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్షం ప్రయత్నించింది. అయితే, అవి నిరాధార వార్తలని ప్రభుత్వం కొట్టిపారేసింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గిరిజన నేతను అవమానించడం సరికాదని పేర్కొంది.
40 కోట్ల బాహుబలులు
పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 40 కోట్ల మంది బాహుబలులు ఉన్నారని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందన్నారు. ‘టీకాను బాహువుకు ఇస్తారు. అందువల్ల టీకా తీసుకున్నవారు బాహుబలులు అవుతారు. మనం కరోనాపై పోరాడగలిగే బాహుబలిగా మారాలంటే టీకా తీసుకోవడం ఒక్కటే మార్గం’అని వ్యాఖ్యానించారు. ప్రదాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా బాహుబలిని పలువురు గుర్తు చేశారు. టీకా మొదటి డోసు ‘బాహుబలి 1’అని రెండో డోసు ‘బాహుబలి 2’అని ట్విటర్ యూజర్ ఒకరు సరదాగా వ్యాఖ్యానించారు. ‘కరోనా వైరస్ కట్టప్పలాంటిది. వెన్నుపోటు పొడుస్తుంది. బాహుబలి సినిమాలా నిజ జీవితంలో రెండో పార్ట్ ఉండదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి’అని మరో యూజర్ పేర్కొన్నారు.
ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి
మోదీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో అన్ని సమస్యలపై ఆరోగ్యకరమైన రీతిలో చర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘కరోనా మహమ్మారికి సంబంధించిన అన్ని అంశాలు, మహమ్మారిపై మా పోరాటం చర్చకు వస్తుందని నేను ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు పదునైన, కఠినమైన ప్రశ్నలను అడగాలని, అయితే స్నేహపూర్వక వాతావరణంలో వాటిపై స్పందించడానికి ప్రభుత్వాన్ని కూడా అనుమతించాలని కోరారు. కోవిడ్–19 రెండో వేవ్ నిర్వహణ వైఫల్యాలు, ఇంధన ధరల పెరుగుదల, రైతుల ఆందోళన సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన వెలిబుచ్చుతున్న తరుణంలో ప్రధానమంత్రి ఈ విజ్ఞప్తి చేశారు. ‘మేం సభలో, సభ వెలుపల అన్ని స్థాయిల్లో నాయకులతో చర్చించాలనుకుంటున్నాం. నేను నిరంతరం ముఖ్యమంత్రులను సంప్రదిస్తున్నా. అన్ని రకాల చర్చలు వేర్వేరు వేదికల ద్వారా జరుగుతున్నాయి. సభ జరుగుతున్నందున నేను ఫ్లోర్ లీడర్లను కలవాలనుకుంటున్నాను. ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. మహమ్మారి గురించి ముఖాముఖి మాట్లాడవచ్చు’అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment