PMO Serious On Telangana CM KCR Released Video Of TRS MLAs Poaching, Details Inside - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలకు 'ఎర' వ్యవహారం.. రంగంలోకి పీఎంఓ.. నిజాలు నిగ్గు తేల్చే పనిలో..

Published Sat, Nov 5 2022 2:18 AM | Last Updated on Sat, Nov 5 2022 8:44 AM

PMO Serious On Telangana CM KCR Video TRS MLAs Poaching - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం చినికిచినికి గాలివానలా మారుతుండటం, నేరుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలపైనే ఆరోపణలు రావడంతో.. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో చోటు చేసుకున్న ప్రలోభాలకు సంబంధించిన వీడియోలను తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు బహిర్గతం చేయడం, న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ మీడియా, దర్యాప్తు సంస్థలకు పంపిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంలోని వాస్తవాలను వెలికితీసే పనిలో పీఎంఓ నిమగ్నమైనట్టు కేంద్రంలోని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.

పీఎంఓలోని ముగ్గురు కీలక అధికారులకు దీనికి సంబంధించిన బాధ్యతలు కట్టబెట్టినట్లు సమాచారం. వీడియోలో ఉన్న వ్యక్తులతో ప్రముఖులకు ఉన్న లింకులు, నకిలీ ఆధార్‌ కార్డులతో పాటు వారి కాల్‌ డేటా తదితర అంశాలపై లోతైన దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల రెండోవారంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఉండనున్నందున.. అప్పట్లోగానే దీనిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయనున్నట్టు తెలిసింది.  

ముఖ్యుల పేర్ల ప్రస్తావనతో అప్రమత్తం 
ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని బీజేపీ అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకుంది. మధ్యవర్తుల సంభాషణల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ పేర్లు ప్రస్తావనకు రావడం, దీన్ని ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజకీయ అంశంగా లేవనెత్తడం, గుజరాత్‌ ఎన్నికల ప్రచారాస్త్రంగానూ ప్రతిపక్షాలు దీన్ని వాడుకునే అవకాశాల నేపథ్యంలో.. పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేసింది. రాజకీయంగా దీన్ని ఎదుర్కోవాల్సిన తీరు, న్యాయపరంగా చేయాల్సిన పోరాటంపై మార్గదర్శనం చేసింది.

జాతీయ నాయకత్వం సూచనల మేరకు.. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ సైతం కేసీఆర్‌పై విమర్శల దాడి చేశారు. ఇక హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు.  

మధ్యవర్తులపై ఇంటిలిజెన్స్‌కు ఆదేశాలు 
పీఎంఓ ఇప్పటికే సదరు వీడియో క్లిప్పింగ్‌లను సేకరించడంతో పాటు, మధ్యవర్తుల కాల్‌డేటాపై విశ్లేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం దీనిపై లోతైన విచారణ చేస్తున్నట్టు సమాచారం. మధ్యవర్తులు ఎవరు? వారికి బీజేపీతో సంబంధాలున్నాయా? బీజేపీ నేతలెవరితో టచ్‌లో ఉన్నారు?, వీరికి గతంలో ఏదైనా నేర చర్రిత ఉందా? అన్న అంశాలపై కూపీ లాగుతున్నారు.

మధ్యవర్తుల రోజువారీ కార్యకలాపాలు, వారి వ్యాపారాలు, లావాదేవీలు ఆరా తీయాల్సిందిగా ఇంటిలిజెన్స్‌ సంస్థలకు ఆదేశాలిచ్చినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో మధ్యవర్తులు జరిపిన సంభాషణల్లో డబ్బుతో ముడిపడిన అంశాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు అందించిన సహకారం, రాజస్తాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సిద్ధమైన ప్రణాళిక, వాటికి తామందించిన సహకారం వంటి అంశాల ప్రస్తావన ఉండటంతో ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలి వేయరాదన్న గట్టి నిర్ణయానికి పీఎంఓ వచ్చినట్లు తెలిసింది.  
పీఎంఓకు కేంద్ర హోం శాఖ నివేదిక! 
ఈ అంశంలో కేంద్ర హోంశాఖ ప్రాథమిక ఇప్పటికే దర్యాప్తు చేసిందని, ఆ నివేదిక సైతం శుక్రవారం పీఎంఓకు చేరిందని సమాచారం. ఎఫ్‌ఐఆర్, కోర్టుకు సమర్పించిన అంశాలు, రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్న అంశాలపై అందులో కూలంకషంగా వివరించినట్లు తెలిసింది. వీటన్నింటినీ నిశితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా ఈ అంశం ఇప్పటికే న్యాయస్థానాల్లో విచారణ దశల్లో ఉన్నందున, కోర్టు ఆదేశాల అనంతరం దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ చేయించే అవకాశాలను కడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
చదవండి: ‘వీడియోలో అమిత్‌షా పేరు చెబితే.. సంబంధం ఉన్నట్టేనా?’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement