సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అతిత్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందనే వార్త ఒకటి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జనసేన నేత, పవన్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కనున్న నేపథ్యంతో ఈ పరిణామం తప్పదనేది ఆ వార్త సారాంశం. ఈ క్రమంలో ఇప్పుడున్న కేబినెట్‌లో ఐదుగురికి ఉద్వాసన తప్పదనే మరో ప్రచారం తీవ్రంగా నడుస్తోంది. కూటమికి చెందిన.. అదీ టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేతే ఈ ప్రచారం దగ్గరుండి చేయిస్తుండడం గమనార్హం.
ఏపీలో కేబినెట్ విస్తరణ ఈ నెలలోనే ఉంటుందా? లేదంటే సంక్రాంతి తర్వాత అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది. నాగబాబు కేబినెట్ ఎంట్రీ ఒక ఎత్తు అయితే.. ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో ఐదుగురిని మారుస్తారనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికి కేబినెట్‌లో ఒక్క స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబుకు ఆ ఒక్కస్థానం అప్పగిస్తే సరిపోతుంది కదా?. కానీ, ఈ విషయంపై ఆ టీడీపీ పెద్ద ఏం చెబుతున్నారంటే..
ఇప్పుడు ఏపీ మంత్రులు సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, సవిత పట్ల చంద్రబాబు మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ పనితీరు కూడా పెద్దగా బాగోలేదనే చంద్రబాబు అనుకుంటున్నారు. బోనస్‌గా.. హోం మంత్రి అనిత విషయంలోనూ పాజిటివ్‌నెస్ లేదు’’ అని ప్రచారం చేయిస్తున్నారు. ఆ టీడీపీ నేత చెప్పిన విషయాల గురించే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులు జోరుగా చర్చించుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే.. నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన కూటమి సర్కారులో చిన్నపాటి చిచ్చు రాజేసింది. టీడీపీ నేతలు ఆ ప్రకటనతో రగిలిపోతున్నారు. అయితే చంద్రబాబు వాళ్ల ఆవేశాన్ని చల్లార్చినట్లు సమాచారం.
తొలుత.. ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకు ఇస్తారని, పవన్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు ఊహాగానాలు వినవచ్చాయి. అయితే.. ఢిల్లీ లెవల్‌లో జనసేన పప్రాతినిధ్యం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుంది. అందుకే ఆ మూడు సీట్లలో ఒకటి బీజేపీ.. రెండు టీడీపీకి ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో ఏపీ కేబినెట్‌లో నాగబాబును తీసుకుంటున్నట్లు ప్రకటించి.. జనసేనలో పేరుకుపోయిన అసంతృప్తిని చంద్రబాబు చల్లాచర్చారు.
Comments
Please login to add a commentAdd a comment