తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు?. గత సభలో ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రాజాసింగ్‌నే కంటిన్యూ చేస్తారా?. లేక కొత్తగా ఎన్నికైనవారిలో ఎవరికైనా అప్పగిస్తారా?. తాజాగా అసెంబ్లీకి ఎన్నికైన ఎనిమిది మంది కమలం పార్టీ ఎమ్మెల్యేల్లో అందరికంటే సీనియర్ రాజాసింగ్ మాత్రమే. అందుకే ఇప్పుడీ విషయంపై బీజేపీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. అసలు బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతోంది?..
తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వరరెడ్డి రెండోసారి గెలుపొందారు. అయితే, ఏలేటి కొంతకాలం క్రితమే బీజేపీలో చేరారు. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్మేలు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, మరో ముగ్గురు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గెలుపొందారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారు, సీనియర్లు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు వంటివారంతా ఓడిపోయారు.
అసెంబ్లీ కార్యకలాపాల విషయంలో అనుభవం ఉన్నవారు ఇద్దరే ఉండటంతో శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ కమలం పార్టీలో జరుగుతోంది. గత అసెంబ్లీలో రాజాసింగ్ ఒక్కరే గెలవడంతో ఆయనే సభాపక్ష నేతగా కొనసాగారు. తర్వాత ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్‌రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందినా ఫ్లోర్ లీడర్‌గా రాజాసింగ్‌నే కొనసాగించారు. రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఆ పదవి మరొకరికి ఇవ్వలేదు. ఇప్పుడు మూడోసారి గెలిచిన రాజాసింగ్‌నే మరోసారి పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కమలం పార్టీ నాయకత్వం కొనసాగిస్తుందా? లేక మరొకరికి ఆ బాధ్యత అప్పగిస్తుందా అనే టాక్ నడుస్తోంది.
రాజాసింగ్ ఇలా..
రాజాసింగ్ తన నియోజకవర్గమైన గోషామహల్‌కే పరిమితం అవుతున్నారు. పైగా ఆయనకు తెలుగు భాషపై కూడా పట్టు లేదు. రాష్ట్ర సమస్యల మీదా అవగాహన లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ, మూడోసారి గెలిచారు గనుక ఆయనకే ఫ్లోర్ లీడర్ బాధ్యత అప్పగించాలని కొందరు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డినే ఫ్లోర్ లీడర్‌గా నియమించే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం మహేశ్వరరెడ్డికి ఉంది. రాష్ట్రంలోని సమస్యల పట్ల కూడా ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇవ్వవచ్చని అనుకుంటున్నారు.
కాటిపల్లికి ఛాన్స్..
కానీ, కామారెడ్డిలో అనూహ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ను, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఏకకాలంలో ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా చేయాలంటూ ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఆయనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకొని రాష్ట్రమంతా తిప్పాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎంపిక చేసి ఆయన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కాటిపల్లిని ఫ్లోర్ లీడర్ చేయాలని సూచిస్తున్నారు. కాటిపల్లి సమస్యలపై మాట్లాడగలరని, ఆయనలో పోరాటం చేసే తత్వం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
అయితే, కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర స్థాయి రాజకీయాలకు కొత్త, ఎక్కువగా తన నియోజకవర్గానికి పరిమితమైనటువంటి వ్యక్తి కావడంతో పార్టీ హై కమాండ్ ఏ మేరకు ఆయన వైపు మొగ్గు చూపుతుందనేది సందేహమే అంటున్నారు మరికొందరు నేతలు. ఏదేమైనా అసెంబ్లీలో బీజేపీ నేత ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment