ఆంధ్రప్రదేశ్‌లో జనసేనలో జరుగుతున్న పరిణామాలు కచ్చితంగా ఆ పార్టీలో అంతర్మధనానికి దారితీసేవే. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ లొంగుబాటు తనానికి, పార్టీ కార్యకర్తల ఆత్మాభిమానానికి మధ్య ప్రచ్ఛన్న యుద్దం జరుగుతన్నట్లు కనిపిస్తుంది. పార్టీ అభిమాని, కాపు సంక్షేమ సేననేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య రాసిన లేఖ ఇందుకు దర్పణంగా కనిపిస్తుంది.
పవన్‌కళ్యాణ్ తన చేతిలో ఉండాల్సిన రాజకీయాన్ని, చేజేతులారా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి, ఆయన ఇంటి చుట్టూ తిరిగే దైన్య స్థితిని తెచ్చుకోవాడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్‌కళ్యాణ్ ఎటూ ముఖ్యమంత్రి పదవి వస్తుందని అనుకోవడం లేదు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఆ విషయం స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. దానికి పవన్ కూడా ఆమోదముద్ర వేశారు. తద్వారా కాపు సామాజికవర్గం గుండెల్లో గునపాలు దించినంత పనిచేశారు. గత కొన్ని దశాబ్దాలుగా సీఎం అభ్యర్ధిగా తమ వర్గం వ్యక్తి ఉండాలని కాపులు కోరుకుంటున్న మాట వాస్తవం.
ఈ క్రమంలో పవన్‌కళ్యాణ్ తమ ఆశలకు ఊయల వేస్తారని వారంతా భావించారు. కాని ఆయనేమో తెలుగుదేశం ఊయలను ఊపి ఆనందపడే వ్యక్తిగా మారిపోవడం వారికి జీర్ణం కావడం లేదు. ఒకటికి, రెండుసార్లు చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లి సాధించింది ఏమిటంటే ఓ ఇరవై అసెంబ్లీ సీట్లు, రెండు లోక్ సభ సీట్లు సాధించడమా! మరో ఐదు సీట్లు ఇవ్వాలని చంద్రబాబును బతిమలాడుకోవడం కూడా ఎంత పరువు తక్కువగా ఉంది! కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పత్రిక అయిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని జాగ్రత్తగా చదివితే ఈ విషయం అర్ధం అవుతుంంది.
మిగిలిన పత్రికలలో పవన్ 38 సీట్లు అడిగితే 28 సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సిద్దపడ్డారని, మరో నాలుగు సీట్లు ఇవ్వాలని కోరుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ టీడీపీ అధికార మీడియా మాత్రం జనసేనకు ఇరవై సీట్లే ఇస్తే సరిపోతుందన్నట్లు కథనాన్ని ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ తాను గెలవలేనన్న భయంతో పవన్‌కళ్యాణ్‌తో జత కడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అన్న ఆశతో ఆయనను బుట్టలో వేసుకుంది. కారణం తెలియదు కానీ, పవన్‌కళ్యాణ్ తన జుట్టును టీడీపీలో చేతిలో పెట్టేశారు. వారు ఎన్ని సీట్లు ఇస్తే అన్నే తీసుకునే దైన్య స్థితిలో పడ్డారు.
అవినీతి కేసులో చిక్కి రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉన్నప్పుడు పవన్‌కళ్యాణ్ పలకరించడానికి వెళ్లారు. అంతవరకు ఆక్షేపణ లేదు. కాని ఆ తర్వాత ఎలాంటి సంప్రదింపులు లేకుండానే టీడీపీతో పొత్తు ప్రకటన చేసి జనసేన క్యాడర్‌ను గందరగోళంలోకి నెట్టేశారు. పవన్ అనుభవరాహిత్యంతో పై చేయిగా ఉండాల్సిన జనసేనను టీడీపీ కాళ్ల దగ్గర పడేశారన్నది పలువురు జనసేన నేతల భావనగా ఉంది. అదే పవన్‌కళ్యాణ్ మర్యాదపూర్వక సంబంధాలు కొనసాగించి, సీట్ల విషయంలో ఏమీ మాట్లాడకుండా, రాజీ పడకుండా కూర్చుని ఉంటే చంద్రబాబే ఈయన ఇంటికి తిరగవలసి వచ్చేదన్నది వారి అభిప్రాయం. అప్పుడు తమ డిమాండ్ ప్రకారం సీట్లు పొందే అవకాశం ఉండేదని వారు చెబుతున్నారు.
పైగా తాము అడగకుండానే పవన్ తానే పొత్తు ప్రతిపాదించారని టీడీపీ నేతలు చెబుతూ ఆయన గాలి తీసేశారు. సీఎం పదవికి అవసరమైన అనుభవం, సమర్థత చంద్రబాబుకే ఉన్నాయని, ఆ విషయం పవన్ కూడా ఒప్పుకున్నారని లోకేష్ ప్రకటించడం ద్వారా ఆయన పరువు పూర్తిగా తీసేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి విషయం కూడా టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని లోకేష్ అన్నప్పటికీ పవన్ స్పందించకపోవడం జనసేనలో చాలామందికి జీర్ణం కాలేదు. లోకేష్ ప్రకటనను చంద్రబాబు కూడా ఖండించలేదు. అయినా పవన్ మాత్రం చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు.
అంటే ఈ రెండు కీలక పదవులకు తాను పనికి రానని ఒప్పుకున్నట్లే అవుతుంది కదా! ఏదో పదో, పరకో సీట్లు ఇస్తే సరిపోతుందని టీడీపీ ఓ మోస్తరు నాయకులు సైతం బహిరంగంగానే అంటుంటారు. పవన్‌కళ్యాణ్ కూడా అందుకు తగ్గట్లుగానే వ్యవహరిస్తున్నారు. చివరికి ఒక ఇరవై సీట్ల వద్ద బేరం ఆడుకోవల్సిన దుస్థితిలో ఆయన పడ్డారు. మహా అయితే ఇంకో ఐదు సీట్లు ఇవ్వవచ్చని టీడీపీ పత్రిక రాసింది. పవన్ కనుక తన అరవై సీట్ల డిమాండ్‌తో గట్టిగా నిలబడి ఉండి, ఆయన చంద్రబాబు మాదిరి తన సభలను తాను జరుపుకుంటూ వెళితే, తెలుగుదేశం పార్టీ దెబ్బకు దిగివచ్చేదని పలువురు అంటున్నారు. ఆ అవకాశాన్ని పవన్‌కళ్యాణ్ చేజేతులారా జార్చుకున్నారు.
ఈ నేపథ్యంలోనే హరిరామజోగయ్య రాసిన లేఖను చూడాల్సి ఉంటుంది. ఆయన చాలా స్పష్టంగా చంద్రబాబును సీఎంను చేయడానికి కాపులంతా పవన్‌కు మద్దతు ఇవ్వాలా అని ఆయన ప్రశ్నించారు. 'అది కుదరని పని' ఆయన కుండబద్దలు కొట్టినట్లే చెప్పారనుకోవాలి. పవన్‌కళ్యాణ్‌కు రెండున్నరేళ్లు సీఎం పదవి ఇవ్వడానికి ఓకే అని చంద్రబాబుతో ప్రకటన చేయించాలని జోగయ్య డిమాండ్ చేశారు. అలాకాని పక్షంలో టీడీపీ, జనసేన పొత్తు పెటాకులు అయినట్లేనని జోగయ్య అభిప్రాయం కావచ్చు. దీనికి పవన్ సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు.
పైగా పవన్ అభిమానులు కొందరు హరిరామజోగయ్య వయసును కూడా చూడకుండా, ఆయనపై అభ్యంతరకర వ్యాఖ్యలను సోషల్ మీడియాలో చేస్తున్నారు. కొన్ని పత్రికలలో రాయిస్తున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. పవన్‌కళ్యాణ్‌కు ఒక ఏడాది సీఎం పదవి ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పవచ్చని ప్రచారం జరుగుతోంది. అది కష్టమే కావచ్చు. నిజంగానే అది జరిగినా కేవలం కంటితుడుపునకే అవుతుంది. జనసేనపై ఆధారపడే రీతిలో టీడీపీ ఉండకపోతే, సొంతంగా టీడీపీకి మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంటే వారు జనసేనకు ఎందుకు విలువ ఇస్తారు? వీరిద్దరూ కలిసినా గెలిచే అవకాశం లేదన్నది సర్వేల సారాంశం.
అది వేరే విషయం. ఒకవేళ ఈ కూటమి అధికారంలోకి వస్తుందని అనుకున్నా, జనసేనకు ఇచ్చే పాతిక సీట్లలో ఓ పది సీట్లు గెలిచినా పెద్ద ఉపయోగం ఉండదు. ఆ పది సీట్లే టీడీపీ అధికారంలోకి రావడానికి కీలకం అయితే తప్ప.. సొంతంగా ఆధిక్యత వస్తే టీడీపీకి జనసేనతో పని ఉండదు. అప్పుడు చంద్రబాబు పెట్టే టరమ్స్‌కు పవన్ ఒప్పుకోక తప్పదు. మహా ఇస్తే ఒక మంత్రి పదవి ఇస్తారు. లేకుంటే లేదు. దీని నంతటిని అంచనావేసే శక్తి పవన్‌కు ఉండకపోవచ్చు. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నఏ వ్యక్తి అయినా వీటి గురించి ఆలోచించాలి.
చంద్రబాబు ఈ మధ్యకాలంలో నిర్వహిస్తున్న సభలకు కూడా జనం అంతంతమాత్రంగానే వస్తున్నారు. అందుకే పవన్‌కళ్యాణ్‌కు ఉండే సినీ గ్లామర్‌ను అడ్డుపెట్టుకుని ఆయన అభిమానులను కూడా పోగు చేస్తే కొంత మెరుగ్గా ఉండవచ్చన్నది టీడీపీ భావన. ఈ రకంగా పవన్‌ను వాడుకుని తాను అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే, జనసేనకు వెన్నుపోటు పొడిచి తను ఒక్కడినైనా గెలవాలని పవన్ ఆలోచన చేస్తున్నారేమోనన్న అనుమానం జనసైనికులకు కలుగుతోంది. ఇది ఒక వ్యవహారం అయితే, బీజేపీది మరో కథగా ఉంది.
తమ పార్ట్నర్ పవన్‌కళ్యాణ్ తమకు చెప్పకుండానే టీడీపీతో లేచి వెళ్లిపోయినా ఏమి అనలేకపోతున్నారు. పైగా జనసేన తమ పొత్తులోనే ఉందని చెబుతున్నారు. ఇంకో వైపు తాము 175 సీట్లకు పోటీకి సిద్దమవుతున్నామని బీజేపీకి చెందిన మరికొందరు నేతలు ప్రకటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకోసం అర్రులు చాస్తోంది. కానీ టీడీపీ మీడియా మాత్రం బీజేపీనే టీడీపీ పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తోందని ప్రచారంలో దిగింది. రాజకీయాలలో అక్రమ సంబంధాలు ఎలా ఉంటాయో చూడాలంటే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీల మధ్య సాగుతున్న వ్యవహారాలే ఉదాహరణగా ఉంటాయి.
మరో సంగతి చెప్పాలి.. పవన్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విషయం ప్రస్తావించి, చెల్లెకు జగన్‌మోహన్‌రెడ్డి గౌరవం ఇవ్వడం లేదని పచ్చి అబద్ధపు ప్రసంగం చేశారు. తన తల్లిని లోకేష్ దూషించారని గతంలో చెప్పిన పవన్, అదే టీడీపీతో అంటకాగుతున్న సంగతిని ఎవరూ మర్చిపోలేదు. దానికి మించి ఆయన రెండో భార్య రేణుదేశాయ్ తన గురించి ఏమి చెప్పిందో ఒక్కసారి ఆ వీడియో చూస్తే సరిపోతుంది. వీటిపై వివరణ ఇచ్చాక పవన్ ఏమి మాట్లాడినా వినవచ్చు. అద్దాల మేడలో ఉండి ఎదుటివారిపై రాళ్లు వేయాలనుకుంటే అవి తన పైనే పడతాయని పవన్‌కళ్యాణ్ తెలుసుకుంటే మంచిది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment