న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం పలువురు సిక్కు మత ప్రముఖులతో తన నివాసంలో సమావేశమయ్యారు. సిక్కు మతస్తుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వారికి వివరించారు. పంజాబ్ అసెంబ్లీకి మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనుండగా జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, అకాలీదళ్ తిరుగుబాటు వర్గం నేత సుఖ్‌దేవ్ సింగ్ థిండ్సాలతో ఏర్పడిన తమ కూటమి బలమైందని చూపి, సిక్కు వర్గం ఓట్లు, వారి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది.
ఇందులో భాగంగా జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ గ్రహీత బాబా బల్బీర్ సింగ్ సిచేవాల్, యమునానగర్‌కు చెందిన మహంత్ కరంజీత్ సింగ్, కర్నాల్‌కు చెందిన బాబా జోగా సింగ్, అమృత్‌సర్‌కు చెందిన సంత్ బాబా మెజోర్ సింగ్ సహా పలువురు సిక్కు ప్రముఖులు హాజరైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. దేశ సేవ,, రక్షణతోపాటు, సిక్కు సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడంలో సిక్కు నేతలు ముందున్నారని అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment