
న్యూఢిల్లీ: అమెరికాలోని సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రలో భారత ప్రమేయముందన్న అంశంపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ అంశంపై మోదీ మాట్లాడారు. ‘‘ పన్నూ హత్య కుట్రలో భారత్ ప్రమేయముందని ఎవరైనా బలమైన ఆధారాలు మా ప్రభుత్వానికి సమరి్పస్తే తప్పకుండా పరిశీలిస్తాం.
మా భారతీయ పౌరుడు ఏదైనా మంచిపనో, చెడు పనో చేసి ఉంటే మాకు చెప్పండి. బలమైన ఆధారాలు అందజేయండి. మేం తప్పక పరిశీలిస్తాం. చట్టబద్ధపాలనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంబంధంలేని విషయాలతో అమెరికా–భారత్ దౌత్య సంబంధాలను కలపొద్దు. గత కొద్ది సంవత్సరాలుగా ఇరుదేశాల మైత్రి బంధం మరింత బలపడుతోంది. అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వమున్న పన్నూను హత్యచేసేందుకు భారతీయ అధికారితో కలిసి నిఖిల్ గుప్తా అనే భారతీయుడు కుట్ర పన్నాడని అమెరికా ఆరోపిస్తోంది.
ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ పోలీసుల కస్టడీలో ఉన్న గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా ఒత్తిడిపెంచిన నేపథ్యంలో దీనిపై మోదీ మాట్లాడారు. ‘‘ అనవసర ఆరోపణల విషయం మాదాకా వచి్చంది. ఇప్పటికే ఈ ఆరోపణల్లో నిజానిజాల నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేశాం’’ అని మోదీ వెల్లడించారు. ‘‘ భావ ప్రకటనా స్వేచ్ఛ మాటున కొందరు విదేశాల్లో ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇంకోవైపు అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు సమున్నత స్థితికి చేరుకుంటున్నాయి. ఇలాంటి వేర్వేరు ఘటనలకు మధ్య సంబంధం అంటగట్టడం సరికాదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment