
సీఎం స్టాలిన్‌తో అబ్దుల్లా(ఫొటో: అబ్దుల్లా ట్విటర్)
డీఎంకే దూకుడు.. అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితుల్లోలేని అన్నాడీఎంకే!
సాక్షి,చెన్నై: రాజ్యసభకు డీఎంకే అభ్యర్థి ఎంఎం అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఓ సీటుకు సెప్టెంబర్ 13న ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఈనెల 30వ తేది వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఇందుకోసం అసెంబ్లీ కార్యాలయం ఆవరణలో నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు. అయితే, డీఎంకే అభ్యర్థిగా అబ్దుల్లా పేరును ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి తగినంత మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో అబ్దుల్లా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఇక, అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితుల్లో అన్నాడీఎంకే వర్గాలు లేనట్లు తెలుస్తోంది.