అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మండిపాటు
మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే తిహార్ జైలులో ఉన్నారు
సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా ఢిల్లీ వెళ్లి రాజకీయ ఒప్పందం చేసుకున్న నీచులు
సీతక్కను అవమానించేలా మీమ్స్ పెట్టిన వారిని చెప్పుతో కొట్టాలి
అక్కా.. మీరు వాళ్ల ఉచ్చులో పడొద్దంటూ సబితను ఉద్దేశించి వ్యాఖ్య
హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇచ్చింది నాటి సీఎం వైఎస్సార్ అని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీపై చర్చ జరగకూడదని బీఆర్ ఎస్ నేతలు అక్కలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, కావాలనే సభను స్తంభింపజేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను తాను సొంత అక్కలుగానే భావించానని.. కానీ వారు దొర పన్నిన కుట్రలో బందీ అయ్యారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నేతలకు రాజకీయ ప్రయోజనమే తప్ప.. ప్రజల ప్రయోజనం పట్టదని మండిపడ్డారు. గురువారం అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడారు.
వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను నేను సొంత అక్కలుగానే భావించా. ఒక అక్క నన్ను నడిబజారులో వదిలేసింది. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. అప్పుడు నమోదైన కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. తన కోసం ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తివేయాలని ఆమె ఎప్పుడైనా చెప్పారా? నన్ను నమ్ముకున్న సీతక్క, సురేఖ అక్క ఇద్దరూ మంత్రులై ముందు వరుసలో ఉన్నారు.
సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా రాజకీయాలు
బీఆర్‌ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో సీతక్కను అవమానించేలా మీమ్స్ పెడుతున్నారు. ఆ మీమ్స్‌ను ఇక్కడ చూపిస్తే సభా గౌరవం పోతుంది. అలా మీమ్స్ పెట్టిన వాళ్లను చెప్పుతో కొట్టాలి. వారు ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్టు కాదా? సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా.. ఢిల్లీ వెళ్లి రాజకీయాలు చేస్తున్న నీచులు వారు. సొంత చెల్లిల్ని ఏడాదిపాటు జైల్లో ఉంచినా ఫర్వాలేదు. మా జోలికి రాకండి అన్నవిధంగా వారి వ్యవహారశైలి ఉంది. మైక్ ఇస్తే శాపనార్థాలు.. ఇవ్వకపోతే పోడియం దగ్గర నిరసనలు చేస్తున్నారు. నా చెల్లెలు జైల్లో ఉంటే నేను రాజకీయాల కోసం బజార్‌లో తిరిగే వాడిని కాదు. నేను అక్కను అవమానించే నీతిలేని వాడిని కాదు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ అయ్యారు. అక్కా మీరు వాళ్ల ఉచ్చులో పడొద్దు.
కేసీఆర్ చర్చలో పాల్గొంటే బాగుండేది..
ఎస్సీ వర్గీకరణపై అందరూ పండుగ చేసుకుంటుంటే.. బీఆర్‌ఎస్ వాళ్లకు అదేమీ పట్టడం లేదు. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే.. రాక్షసులు భగ్నం చేయడానికి వచ్చినట్టుగా బీఆర్‌ఎస్ నేతల వైఖరి ఉంది. దళిత బిడ్డలు సంతోషపడే రోజు వస్తే నిలబడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసి వెళ్లిపోయింది. వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నా. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలి.
కేసీఆర్ కూడా దీనిపై మాట్లాడితే బాగుండేది. ఇంత కీలక అంశం సభలో చర్చకు వస్తున్నప్పుడు స్వయంగా కేసీఆర్ చర్చలో పాల్గొంటే బాగుండేది. స్పీకర్ దళితుడు కాబట్టే ఆయన ముందు కింద కూర్చోకూడదనే కేసీఆర్ సభకు రావడం లేదు..’’అని రేవంత్ పేర్కొన్నారు. అసలు కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీయే రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. హరీశ్‌రావుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. స్కిల్స్ యూనివర్సిటీ భూమిపూజకు అందరూ రావాల్సిందిగా రేవంత్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment