మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఓ పియర్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రి ఉత్తమ్ తదితరులు
మేడిగడ్డ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టును రూ.94 వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తే.. 98వేల ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే వచ్చిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. డిజైన్, నిర్మాణ, నిర్వహణ లోపాలతో నిర్మించిన మూడేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోయే స్థితికి చేరిందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్లను మంగళవారం సాయంత్రం రేవంత్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, బ్యారేజీ కుంగిన తీరు, ఇతర అంశాలపై ఇన్‌చార్జి చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి, విజిలెన్స్ డీజీ రాజీవ్‌రతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘రూ.94వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు కూడా నీరివ్వకపోయినా.. కోటి ఎకరాలకు నీళ్లిచ్చినట్టు కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారు. రూ.36 వేలకోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా వైఎస్సార్ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కాదని.. రీడిజైన్ పేరుతో అవినీతి కోసం లక్ష కోట్ల ప్రాజెక్టును నిర్మించారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ పియర్లు కుంగిపోతే.. సరిచేసే ప్రయత్నం చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరించారు. పోలీస్ పహారాతో ఎవరినీ ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అ అంశంపై మేం అసెంబ్లీలో చర్చ పెడితే.. కేసీఆర్ వేల కోట్ల దోపిడీపై చర్చ జరగకుండా ఉండాలనే నల్లగొండలో సభ పెట్టుకున్నారు. ప్రజల ముందు బండారమంతా బయటపడుతోందనే కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడికి దిగారు.
నల్లగొండ దూరమా?.. అసెంబ్లీ దూరమా?
చావు నోట్లో తలకాయ పెట్టానంటూ కేసీఆర్ కోటి ఒకటవసారి అబద్ధం చెప్పారు. ఆ మాట నమ్మి ప్రజలు రెండుసార్లు సీఎంగా అవకాశమిస్తే.. భారీగా దోచుకున్నారు. కేసీఆర్ ప్రజల కోసం ఏనాడూ ఏమీ చేయలేదు. ఓడిపోయి సీఎం కుర్చీ పోయింది కాబట్టే మరోసారి ప్రజలు గుర్తుకొచ్చారు. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే అయితే శాసనసభకు ఎందుకు రాలేదు? మీరు చేసిన నిర్వాకాన్ని సభలో ఆధారాలతో సహా బయటపెట్టాం. మేడిగడ్డ సందర్శనకు రావాలని మా మంత్రి ఉత్తమ్ మీకు లేఖ రాశారు. తేదీపై అభ్యంతరం ఉంటే.. మీరు చెప్పిన తేదీనే వెళదామని చెప్పాం. కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్.. నల్లగొండ సభకు ఎలా వెళ్లారు? నల్లగొండ దూరమా? అసెంబ్లీ దూరమా? మేడిగడ్డ బ్యారేజీని రూ.1,800 కోట్ల అంచనాతో డిజైన్ చేసి.. తర్వాత రూ.4 వేల కోట్లకు పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయి. ప్రాజెక్టు రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25వేల కోట్లు అవసరమవుతాయి.
నాలుగైదు పిల్లర్లు కుంగితే ఏమిటని చులకన చేస్తారా?
మేడిగడ్డ పిల్లర్లు కుంగడం కాదు.. ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో ఉంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు కూడా ముప్పు ఉందని తేల్చింది. విజిలెన్స్ నివేదిక కూడా అదే చెప్పింది. కానీ కేసీఆర్ రూ.94 వేలకోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులో నాలుగైదు పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారంటూ చులకనగా మాట్లాడుతున్నారు. కుంగినది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. çతెలంగాణ ప్రజల నమ్మకం. ప్రజల సొమ్ము అంటే అంత చులకనా? మీ లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది. మేడిగడ్డ ఇష్యూను చులకన చేసి మాట్లాడటం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం.
ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్లగొండ సభ
కుంగిన మేడిగడ్డ బ్యారేజీని ఎవరూ చూడకుండా కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు. పోలీసులతో అడ్డుకున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతితో రాహుల్‌గాందీ, నేను, శ్రీధర్‌బాబు బ్యారేజీని పరిశీలించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించాం. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో భారీగా లోపాలు ఉన్నాయని విజిలెన్స్ తేల్చింది. మేడిగడ్డను సందర్శించి వాస్తవాలు తెలుసుకుందామని స్పీకర్ అనుమతితో వచ్చాం. కానీ కేసీఆర్ తన బండారం బయటపడుతుందని భావించి.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు నల్లగొండలో సభ పెట్టారు.
అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వండి
కృష్ణాబోర్డు (కేఆర్‌ఎంబీ)కు ప్రాజెక్టుల అప్పగింతపై అడిగితే తాను సలహాలు ఇచ్చేవాడినని కేసీఆర్ అంటున్నారు. అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వొచ్చని మేం ముందునుంచీ చెప్తున్నాం. స్పీకర్ ద్వారా ప్రతిపక్ష నాయకుడిని పిలిపించాలని కూడా కోరాం. అసెంబ్లీ రాకుండా.. పైగా సభలో చేసిన తీర్మానాన్ని తప్పుపడుతున్నారు. తీర్మానంలో లోపాలుంటే హరీశ్‌రావు ఎలా మద్దతు ఇచ్చారు. అందుకే హరీశ్‌రావు మాటలకు విలువ లేదని.. కేసీఆర్ సభకు రావాలని మేం కోరాం. నల్లగొండ సభలో దిక్కుమాలిన మాటలు మాట్లాడటం కాదు.. శాసనసభకు రండి. ఏం చేయాలో చెప్పండి. మమ్మల్ని వెంటాడతామంటూ బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు. కానీ కాళేశ్వరంపై చర్చకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు?
ముందే తెలిస్తే.. ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదు
మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ మాట్లాడుతున్నారు. మీ గురించి ప్రజలకు ఎన్నికల ముందే తెలిసి ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదు. మీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం ఇంకా సిద్ధంగా ఉందనుకుంటున్నారా? కేసీఆర్‌ను ఆహా్వనిస్తున్నా.. సభకు రావాలి, బడ్జెట్‌తోపాటు సాగునీటి రంగంపై చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆరే కాబట్టి ఆయనే వివరణ ఇవ్వాలని కోరుతున్నాం. ఆయన స్వార్థం కోసం కాకుండా ఒక్కసారైనా ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చండి. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై మీ వైఖరేమిటో సభలో చెప్పండి
సానుభూతి కోసం ఎత్తుగడ
కుర్చీపోగానే కేసీఆర్‌కు నీళ్లు, నల్లగొండ ఫ్లోరైడ్ గుర్తొస్తాయి. అందుకే కుర్చీని వెతుక్కుంటూ నల్లగొండ వెళ్లారు. పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతితో ఓట్లు పొందాలనేది కేసీఆర్ ఎత్తుగడ. భయపడబోనంటూ ప్రగల్భాలు పలకడం కాదు. వచ్చి సభలో మాట్లాడాలి. అవసరమైతే కాళేశ్వరాన్ని సందర్శిస్తానని కేసీఆర్ అంటున్నారు. ఆయన కేసీఆర్ కాళేశ్వరానికి కాదు..ఇక కాశీకి పోవాల్సిందే.
బీజేపీతో చీకటి పొత్తు ఎందుకు?
బీజేపీ, బీఆర్‌ఎస్ ఇంకా ఎన్నాళ్లు చీకట్లో పొత్తు పెట్టుకుంటాయి? మేడిగడ్డ సందర్శనకు బీజేపీ వాళ్లు వస్తారనుకున్నాం. ఎంఐఎం, సీపీఐ వాళ్లు వచ్చారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేపట్టాలన్న బీజేపీ ఇప్పుడు ఎందుకు రాలేదు. కిషన్‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలను రాకుండా అడ్డుకున్నారు. బీజేపీ వైఖరేమిటో, కేసీఆర్ అవినీతికి సహకరిస్తారో, అవినీతిపై విచారణ చేసే మా ప్రభుత్వానికి సహకరిస్తారో ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలి. సీబీఐ విచారణ పేరుతో కేసీఆర్ జుట్టు తమ చేతిలో పెట్టుకొని లబ్ధి పొందాలనుకుంటున్నారు. సీబీఐ కంటే ఉన్నతమైన జ్యుడీషియల్ విచారణ చేయించబోతున్నాం. కేసీఆర్ అవినీతిని బయటపెట్టడానికి ఈ పర్యటన కీలకం. అలాంటి మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి.
బాధ్యులపై విచారణ జరుగుతుంది
సాంకేతిక నిపుణులతో చర్చించాక మేడిగడ్డ పునరి్నర్మాణంపై మా నిర్ణయం వెల్లడిస్తాం. మేం ఇంజనీర్లం కాదు. 80వేల పుస్తకాలు చదవలేదు. అక్రమాలకు బాధ్యులైన వారిపై విచారణ కొనసాగుతుంది. అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టుతో సొమ్ము రికవరీ చేస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.
దేశంలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం
– కట్టిన మూడేళ్లలోనే మేడిగడ్డ కొట్టుకుపోయే దుస్థితి: ఉత్తమ్
– తుగ్లక్ కూడా సిగ్గుపడే విధంగా నిర్మించారని వ్యాఖ్య
మేడిగడ్డ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: స్వతంత్ర భారత చరిత్రలో కాళేశ్వరం కుంభకోణం అతి పెద్దదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.94 వేలకోట్లు ఖర్చు చేసి.. 97 వేల ఎకరాలకు నీరివ్వడమనేది ఎక్కడా ఉండదన్నారు. కట్టిన మూడేళ్లలోనే బ్యారేజీ కొట్టుకుపోయే స్థితికి చేరుకుందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో.. రూ.68 వేలకోట్లు అప్పు తెచ్చినవని, ప్రభుత్వం సమకూర్చిన రూ.33 వేల కోట్లు పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసినవేనని చెప్పారు. వైఎస్సార్ హయాంలో రూ. 38 వేలకోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదిస్తే.. రీడిజైన్ పేరిట ఖర్చును రూ.94వేల కోట్లకు పెంచి 18 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించారని పేర్కొన్నారు. తుగ్లక్ కూడా సిగ్గుపడే విధంగా ప్రాజెక్టు నిర్మించారని విమర్శించారు. డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా తెలియకుండా నిర్మించడం వల్లే ప్రస్తుతం మేడిగడ్డకు ఈ పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌లది ఫెవికాల్ బంధం: పొన్నం
కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శనకు రాలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎంఐఎం, సీపీఐ వచ్చినా బీజేపీ రాకపోవడానికి బీఆర్‌ఎస్‌తో ఆ పారీ్టకి ఉన్న ఫెవికాల్ బంధమే కారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేపట్టడం లేదని, ఆరోపణలతోనే కాలం వెల్లదీయడానికి కారణమేంటని నిలదీశారు.
రూ.లక్ష కోట్లు గోదావరిలో పోసినట్టే
– సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
సాక్షి ప్రతినిధి, వరంగల్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టును ఇలా చూడటం బాధగా ఉందని, రూ.లక్ష కోట్లు గోదావరిలో పోసినట్టేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపం ఉందని, దీనికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఎన్నో కుంభకోణాలు చేసిందని.. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలను ఎగ్గొడుతోందంటూ విమర్శలు చేయడం విడ్డూరమని పేర్కొన్నారు. వైఎస్సార్ సర్కారు ప్రతిపాదించినట్టుగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే.. ఇంత ఖర్చు, వృధా అయ్యేది కాదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment