సాక్షి, హైదరాబాద్: ఉద్యమకారుడినని చెప్పుకున్న కేసీఆర్‌కు వేల ఎకరాల భూములు, ఫాంహౌస్‌లు ఎలా వచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. భూములను కొల్లగొట్టి రూ. లక్ష కోట్లు అక్రమంగా సంపాదించారని, ఆ సంపాదనతోనే దేశ రాజకీయాలను శాసించాలను కుంటున్నారని ఆరోపించారు.
మంగళవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, చామల కిరణ్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, సంగిశెట్టి జగదీశ్వర్, రోహిణ్‌రెడ్డి, మెట్టు సాయికుమార్‌లతో కలసి రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్ భూములు అమ్మితే రూ.2,500 కోట్లు వస్తాయని, ఆ డబ్బులతో రాష్ట్రంలోని నిరుద్యోగులను ఆదుకోవచ్చని వ్యాఖ్యానించారు.
రూ. 800 కోట్ల భూమిని రూ. 100 కోట్లకే..
యశోద ఆసుపత్రులకు రూ. 800 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 100 కోట్లకే సీఎం కేసీఆర్ కేటాయించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికాకు చెందిన అలెగ్జాండ్రియా అనే కంపెనీకి శేరిలింగంపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఐదెకరాల స్థలాన్ని వైద్య, ఆరోగ్య రంగంలో పరిశోధనలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిందని చెప్పారు. ఆ తర్వాత ధరను సవరించారని, సవరించిన మేరకు ఎక్కువ ధర చెల్లించాలని అలెగ్జాండ్రియాతోపాటు మారుతి సుజుకీ కంపెనీకి హెచ్‌ఎండీఏ లేఖ రాసిందని రేవంత్ పేర్కొన్నారు.
అయితే అలెగ్జాండ్రియా కంపెనీ ఆ మొత్తాన్ని చెల్లించుకుండా కోర్టుకు వెళ్లిందని, కోర్టులో కేసు నడుస్తుండగానే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. ఆ భూమిపై కల్వకుంట్ల మాఫియా కన్నుపడిందని, అలెగ్జాండ్రియా కంపెనీని బెదిరించి, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసు ఓడిపోయేలా చేసి రూ. 500 కోట్ల విలువైన భూమిని అలెగ్జాండ్రియా కంపెనీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు.
కోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు కూడా వెళ్లలేదని, ఆ తర్వాత అదే సర్వే నంబర్‌లో ఉన్న మూడెకరాల ప్రభుత్వ భూమిని కూడా అగ్గువకు కొట్టేశారని ఆరోపించారు. ఈ భూమిని యశోదా ఆసుపత్రుల గ్రూప్ గజం రూ. 37,611 చొప్పున కొనుగోలు చేసిందని, వాస్తవానికి అక్కడ గజానికి కనీసం రూ. 2 లక్షల ధర పలుకుతుందని చెప్పారు. ఆ భూమి వెనుక ఉన్న భూమికి హెచ్‌ఎండీఏ గజం రూ. 80 వేలను అప్‌సెట్ ప్రైస్‌గా నిర్ధారించిందని రేవంత్ పేర్కొన్నారు.
కమీషన్లు తీసుకొని అదనపు అంతస్తులకు అనుమతులు...
లిక్కర్ కుంభకోణంలో ఉన్న పెద్దలకు ఖానామెట్‌లో 25 ఎకరాల భూమిని కేటాయించారని, ఇందుకోసం మంత్రి కేటీఆర్‌కు 20 శాతం కమీషన్ ముట్టజెబుతున్నారని రేవంత్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, నాగార్జున సర్కిల్‌లోని భవనాలకు అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారో కేటీఆర్ చెప్పాలన్నారు. తాను చేసిన ఆరోపణలు నిజం కాదని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని రేవంత్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment