సభలో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్
మెట్‌పల్లి(కోరుట్ల)/జగిత్యాలటౌన్: తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రగతిభవన్ నుంచి సాగనంపాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో బహుజన రాజ్యాధికార గర్జన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో ఒక్కశాతం ఉన్న వర్గానికి అధికారం అప్పగిస్తే బహుజనులకు న్యాయం జరగదన్నారు.టీఎస్‌పీఎస్సీని మంత్రి కేటీఆర్ తన దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారని, ఒక్కో పరీక్ష పేపర్‌ను ఆయన రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్ముకున్నారని ఆరోపించారు.
పరీక్షలు వాయిదా పడటం వల్ల మనస్తాపం చెందిన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే, కేటీఆర్ దానిని వక్రీకరిస్తూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే రూ.5 వేల కోట్లతో గల్ఫ్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. బహుజనులు ఎక్కువగా ఉన్న కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా దొరలు గెలవడం సమంజసం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న పూదరి నిషాంత్ కార్తికేయను గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ పూదరి అరుణ, జిల్లా ఇన్‌చార్జి పుప్పాల లింబాద్రి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.
టీఎస్‌పీఎస్సీ రద్దుకు తొలి సంతకం
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేస్తూ తొలి సంతకం చేయడంతో పాటు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలుస్తామని బీఎస్పీ చీఫ్ ప్రవీణ్‌కుమార్ హామీ ఇచ్చారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన బీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్పీ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ ఏక్ నంబర్ అయితే బేటా కేటీఆర్ దస్ నంబర్ అని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావు అంబులెన్సుల్లో డబ్బులు పంపిణీ చేస్తారని అనుమానంగా ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment