Rumours Heard That EX MP Boora Narsaiah Goud Quit TRS, Will Join BJP - Sakshi
Sakshi News home page

Munugode Bypoll: నామినేషన్‌ టైమ్‌లో వెంటుండి.. అంతలోనే ఢిల్లీకి వెళ్లి బీజేపీలోకి?

Published Fri, Oct 14 2022 6:09 PM | Last Updated on Sat, Oct 15 2022 1:25 AM

Rumours Heard That EX MP Boora Narsaiah Goud Quit TRS Will Join BJP - Sakshi

బీజేపీలోకి బూర నర్సయ్యగౌడ్‌! 

     నేడు లేదా రేపు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీకి అవకాశం 
     మునుగోడు టికెట్‌ ఆశించి భంగపడ్డ బూర నర్సయ్యగౌడ్‌ 
     పార్టీ ప్రచార కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని అసంతృప్తి 
     జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో విభేదాలూ కారణమంటున్న పార్టీ వర్గాలు... 

సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ బీజేపీలో చేరనున్నట్టు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికలో టికెట్‌ ఆశించినా పార్టీ పట్టించుకోకపోవడం, పైగా ప్రచా ర కార్యక్రమాలకు దూరంగా పెట్టడంతో నర్సయ్యగౌడ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే ఆయన టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులకు ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లారని.. ఆ యన బీజేపీలో చేరడం లాంఛనమేనని రాజ కీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. శనివారంగానీ, ఆదివారంగానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో బూర నర్సయ్యగౌడ్‌ భేటీ అయ్యే అవకాశం ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే ఆయన చేరిక ఉంటుందని అంటున్నాయి. 

టికెట్‌ నిరాశ.. పట్టించుకోలేదనే అసంతృప్తి 
తెలంగాణ ఉద్యమ సమయంలో డాక్టర్స్‌ జేఏసీ కన్వీనర్‌గా బూర నర్సయ్యగౌడ్‌ కీలకపాత్ర పోషించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున భువనగిరి ఎంపీగా గెలిచారు. 2019లోనూ పోటీ చేసినా ఓడిపోయారు. తర్వాత మునుగోడు నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. వచ్చేసారి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచే బూర నర్సయ్యగౌడ్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

మునుగోడులో బీసీ సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉండటం.. కాంగ్రెస్, బీజేపీల తరఫున రెడ్డి వర్గం అభ్యర్థులే బరిలో దిగడంతో టికెట్‌ తనకే దక్కుతుందని ఆశించారు. కానీ టీఆర్‌ఎస్‌ టికెట్‌ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఇవ్వడంతో తీవ్రంగా అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమ వివరాలను తనకు ఏమాత్రం చెప్పడం లేదంటూ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిపైనే బహిరంగంగానే విమర్శలు చేశారు. బూర నర్సయ్యగౌడ్‌ అసంతృప్తిని గమనించిన టీఆర్‌ఎస్‌ పెద్దలు బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఈ నెల 7న తన అనుచరులతో కలిసి మంత్రి కేటీఆర్, హరీశ్‌రావులతో భేటీ అయిన బూర నర్సయ్యగౌడ్‌.. కూసుకుంట్ల తీరుపై ఫిర్యాదులు చేశారు. సొంతపార్టీ నేతలను రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బందిపెట్టారని వివరించారు.

రెండు రోజుల్లో ఆయా అంశాలపై సర్దుబాటు నిర్ణయాలు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు కూడా. దీనితో బూర నర్సయ్యగౌడ్‌ మెత్తబడినట్టు కనిపించారు. ఈ నెల 13న కూసుకుంట్ల నామినేషన్‌ కార్యక్రమానికి కేటీఆర్‌తో కలిసి హాజరయ్యారు. నామినేషన్‌ తర్వాత నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్‌ నిలబడ్డ వాహనంపైకి బూర నర్సయ్యగౌడ్‌ను పిలవకపోవడంతో మళ్లీ అసంతృప్తికి గురయ్యారని సమాచారం. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో ఏర్పడిన విభేదాలు, జిల్లా పార్టీలో అవమానాలు కూడా ఆయన పార్టీ వీడటానికి కారణంగా చెబుతున్నారు. 

ఢిల్లీ వెళ్లడంతో.. 
బూర నర్సయ్యగౌడ్‌ శుక్రవారం ఉదయం నుంచి టీఆర్‌ఎస్‌ నేతలెవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఇదే సమయంలో ఆయన ఢిల్లీకి వెళ్లడంతో బీజేపీలో చేరుతున్నారని వార్తలు వెలువడ్డాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ను, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. శనివారంగానీ, ఆదివారంగానీ బూర నర్సయ్యగౌడ్‌ బీజేపీ పెద్దలను కలిసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.  
చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌లో ప్రవహించేది కాషాయ రక్తమే.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement