సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం రాత్రి ఇచ్చిన ఆదేశాలు ఇదివరకెన్నడూ చూడనివని, ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించిందంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. ఇలాంటి ఆదేశాల ద్వారా న్యాయస్థానం కొత్త సంప్రదాయానికి తెరతీసిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివరాలివీ..
► ఈ ఆర్డర్ చూశాక పెద్దలకైతే ఒక తీర్పు, మరొకరికైతే ఇంకొక రకమైన తీర్పు అన్నట్లుగా ఉంది. సాధారణంగా ప్రభుత్వం మీడియాకు సంకెళ్లు వేయాలని, వ్యతిరేకంగా చట్టాలు చేయాలని చూస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకుని మీడియా హక్కుల పరిరక్షణకు అండగా నిలబడతాయి.
► కానీ తాజా హైకోర్టు తీర్పు ద్వారా పరిస్థితి ఒక్క సారిగా మారింది. ఇదో కొత్త పోకడ అని అర్థమైంది. ఈ కుంభకోణం విచారణలో న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ అమరావతిలో భూములు కొన్నారని ప్రాథమిక సమాచారం. ఆయనతో పాటు 12 మందిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
► దీంతో దేశంలో అత్యంత పలుకుబడి గల శక్తులన్నీ ఒక్కసారిగా ఏకమయ్యాయి. ఇక్కడ మేం కోర్టులను ఏమీ అనడం లేదు. ఒక కుంభకోణంపై ఎఫ్‌ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక) నమోదు అయితే.. అందులో కొందరు నిందితులుగా ఉన్నంత మాత్రాన ఆ శక్తులన్నీ ఇంత పెద్ద ఎత్తున ఎందుకు కదిలాయో అర్థం కావటం లేదు.
► ఇది ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకో భంగం కలిగించే అంశం కాదు. ఎవరి వ్యక్తిత్వాన్నీ హననం చేసే పరిస్థితీ లేదు. అప్పటికప్పుడు శిక్షలు పడవు. ఎఫ్‌ఐఆర్ మాత్రమే నమోదు అయింది. సహజంగా ఇలాంటి విషయాల్లో సామాన్యుడికి రక్షణగా కోర్టులు నిలబడిన సందర్భాలే ఇంతవరకూ చూశాం.
ఆధారాలతోనే కేసు నమోదు
► ఈ కేసులో అమరావతి రాజధాని ప్రాంతంలో అప్పట్లో పలుకుబడి గల కొందరు వ్యక్తులు భూములు కొన్నారని ఆధారాలుండటంతో స్వంతంత్ర సంస్థ అయిన ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం చట్టం ద్వారా ఏర్పాటు చేసిన సిట్ దానికి ఆధారం. దీనివల్ల ఎవరి ప్రతిష్టకూ భంగం కలుగక పోయినా ఆగమేఘాల మీద మంగళవారం రాత్రి 9.10 గంటలకు దీనిపై హైకోర్టు తీర్పు ఇచ్చింది.
► ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వ్యక్తులు, దాన్లోని అంశాలు మీడియా, సోషల్ మీడియాలో రాకూడదని ఆదేశాలిచ్చింది. దీన్నో విశేషంగా, కొత్త సంప్రదాయంగా మా పార్టీ, ప్రభుత్వం భావిస్తున్నాయి. ఎవరికో ఏదో చురుక్కుమనిపించిందనిపిస్తోంది. దాంతో పెద్దలకు ఒక న్యాయం.. సామాన్యుడికి ఒక న్యాయం ఉంటుందని అనుమానం వచ్చేట్లుగా వ్యవహరించారని భావిస్తున్నాం.
► ఇలాంటి చర్యల వల్ల న్యాయ వ్యవస్థకున్న నిష్పాక్షికతపై నమ్మకం సడలితే.. దానికి ఆ వ్యవస్థే బాధ్యత వహించాలి తప్ప ఇతరులను నిందించలేం. ఈ తీర్పుపై జాతీయ మీడియా సీనియర్ జర్నలిస్టులు, మేధావులు రాజ్ దీప్ సర్దేశాయ్.. సిద్ధార్థ వరదరాజన్, న్యాయ నిపుణుడు ప్రశాంత్ భూషణ్ ఘాటుగా స్పందించారు.
మేధావులు, న్యాయ కోవిదులు ఆలోచించాలి
► ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే, దర్యాప్తు జరగకుండా స్టే ఇవ్వడం అంటే విజ్ఞులు, మేధావులు, న్యాయ కోవిదులు ఆలోచించాలి. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ విచారణలో ఏ మాత్రం తొందర లేదు. ఇది కక్ష సాధింపా.. కాదా అని తేల్చాల్సి ఉండగా.. మసిపూసి, మారేడు కాయ చేసి, నిందితులుగా ఉన్న వారిని తప్పించాలని చూడటం అంటే దొంగలకు రక్షణ ఇవ్వడం వంటిదే.
► ఇది కక్ష సాధింపా? లేదా? అనేది సీబీఐ విచారణలో తేలాలి. అలా కాకుండా కక్ష సాధింపు అని వాదిస్తున్న వారిని రక్షించడమంటే ఇంకేముంది? ఒక దొంగతనాన్ని ఫలానా వ్యక్తే చేశాడనే అనుమానం ఉన్నప్పుడు అనుమానితుడే కోర్టుకు వచ్చి నాపై కోపంతో కేసు పెట్టారు కనుక చెల్లదని అంటే ఎలా ఉంటుంది?
► అసలు తప్పు జరిగిందా, లేదా అన్నది తేల్చాలి కదా! కోర్టులు ప్రీమెడిటేటెడ్‌కు (ముందుగానే ఒక అభిప్రాయానికి) రాకూడదు.
► దమ్మాలపాటి ఒక అడ్వకేట్, అంతకుముందు అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్త. తర్వాత అడిషనల్ ఏజీ అయి, తర్వాత ఏజీ అయ్యారు. ఆయన కోర్టును కదిలించడమేంటి? సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దమ్మాలపాటి గంటకు లక్షల్లో.. రోజుకు కోట్లల్లో ఫీజులు తీసుకునే ముకుల్ రోహిత్గీ లాంటి న్యాయవాదులను ఎలా పెట్టుకోగలిగాడు? వాళ్లేమైనా ఉచితంగా చేస్తున్నారేమో... మాకైతే తెలియదు.
అసలు దర్యాప్తే వద్దా?
► టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈ కుంభకోణంపై ప్రభుత్వం వేసిన సిట్, కేబినెట్ కమిటీల రెండు జీవోలను రద్దు చేయాలని రిట్ వేస్తే హైకోర్టు స్టే ఇచ్చేసింది. ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్‌లో దీనిపై సీబీఐ విచారణను అడిగాం. వాళ్లను కూడా ప్రతివాదులుగా చేర్చండి అని అడిగితే దానిని మాత్రం డిస్మిస్ చేశారు. దీనిపై అసలు దర్యాప్తే వద్దంటారా?
► మంత్రివర్గ ఉపసంఘం, సిట్ దర్యాప్తులపై బుధవారం తీర్పు రానున్నట్లు కోర్టు మంగళవారం రాత్రి 7.30–8.00 గంటలప్పుడు కాజ్ లిస్టులో పెట్టింది. అప్పుడే అందరికీ తెలిసింది. కానీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మంగళవారం సాయంత్రం 5.30 గంటలకే ప్రెస్‌మీట్ పెట్టి ఈ విషయం ఎలా చెప్పగలిగారు?
► అసలు న్యాయస్థానాలున్నది ఎవరి ప్రయోజనాల కోసం? హక్కులు హరించి, న్యాయానికి అవకాశం లేని అశక్తులపై దౌర్జన్యం చేసినప్పుడు హైకోర్టు ప్రశ్నిస్తే అర్థం ఉంటుంది కానీ ఇలా జరిగితే ఎలా?
మీడియా నోరు కట్టేస్తారా?
► మీడియాకు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం అంటే.. మాట్లాడకుండా నోరు కట్టేయడం, నోరు బిగించడం. ఇది ఓవర్ రియాక్షన్‌లా అనిపిస్తుంది.
► దమ్మాలపాటి శ్రీనివాసరావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూతుళ్లు ఉన్నారు కనుక ఇందులో ముందుకు వెళ్లకూడదని వీళ్లు హైకోర్టును అడిగారట. వారు ఏమైనా చేసి ఉంటే వాటిని ప్రశ్నించ కూడదా?
ఇన్ సైడర్ ట్రేడింగ్ స్పష్టం
► 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అమరావతి రాజధాని అంశంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది. 2019 ఎన్నికల్లో మేం ఆ విషయం చెప్పాం. అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం అని కూడా చెప్పాం. దానిమీదే ప్రజలు తీర్పు ఇచ్చారు.
► ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. గత ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే, ఆ తప్పుల మీద, వారు చేసిన అక్రమాల మీద విచారించే హక్కు ఉంటుంది. అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
పెద్దోళ్లుంటే వదిలేయాలా?
► సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూతుళ్లు, మాజీ అడ్వొకేట్ జనరల్.. వీళ్లంతా ఉన్నారు కాబట్టి.. వాళ్లను రక్షించాలి. దీని దారం పట్టుకుని లాగితే చివరకు చంద్రబాబు దగ్గరకు వెళుతుంది. ఇందులో ఎవరైతే తప్పులు చేశారో.. ఆ శక్తులు విజయం సాధిస్తున్నాయనే అనుమానం కలుగుతోంది. దీన్ని ఇక్కడితో వదిలిపెట్టం. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తాం.
► హైకోర్టు తీర్పు పరిగణనలోకి తీసుకుంటే.. ఇక ఎవరూ అమరావతిపై నోరు ఎత్తటానికి వీల్లేదు. గ్యాగింగ్ చాలా తీవ్రమైన విషయం. గ్యాగింగ్ మీడియా, గ్యాగింగ్ సిస్టమ్, గ్యాగింగ్ ఎగ్జిక్యూటివ్, గ్యాగింగ్ లెజిస్లేచర్, గ్యాగింగ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్.. వీటన్నింటిపై విజ్ఞులైన ప్రజలు, మేధావులు, న్యాయ కోవిదులు మాట్లాడాలి.
► అసలు ఇన్ని కేసులు.. ఇన్ని ఎంక్వైరీలు ఎందుకు? జగన్ తనపై కక్ష కట్టి ఇదంతా చేస్తున్నారని చంద్రబాబు అంటే ఇక అంతా అయిపోయినట్టేనా.. కోర్టు డైరెక్షన్ ఇస్తుందా! ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు.. వీళ్లపై కక్ష కట్టామని ఒక పత్రికలో ఇవాళ రాశారు. దమ్మాలపాటి శ్రీనివాస్‌తో కలిపి రాసినందుకు నిజానికి వాళ్లంతా బాధపడిపోయి ఉంటారు.
► గతంలో జగన్‌పై కేసులు వేసినప్పుడు.. తప్పేముంది.. దర్యాప్తు జరుగుతుంది. కడిగిన ముత్యంలా బయటకు రావచ్చు.. అంటూ న్యాయమూర్తులు మాట్లాడారు. అంటే మీకే గౌరవ మర్యాదలు, ప్రతిష్టలు ఉన్నాయా? జగన్‌కు గౌరవ మర్యాదలు అప్పుడు లేవా? దేవాలయాల్లో వరుస ఘటనలు.. చంద్రబాబు నాయుడే చేయిస్తున్నాడనే గట్టి అనుమానం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment