
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కును కాపాడుకునే దిశగా సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధిగా అడుగులేస్తున్నారని, సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై ఆయనకు పరిపూర్ణ అవగాహన ఉందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృ ష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని అనుమతించిన మరుక్షణమే అఖిలపక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జగన్ ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నారని, సమస్యపై ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు. చంద్రబాబు కన్నా మెరుగైన రీతిలో సమస్య పరిష్కరించే సత్తా జగన్‌కు ఉందని చెప్పారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటన చేసిన వెనువెంటనే ఆయన స్పందించారని, కార్మికసంఘాలతో కూడిన అఖిల పక్షంతో చర్చించేం దుకు అవకాశం ఇవ్వాలని ప్రధానికి లేఖ రాశార న్నారు. ఆయన ప్రయత్నాలకు ఇది కొనసాగింపుగా చూడాలన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
విశాఖ ఉక్కు విలువ రూ.31 వేల కోట్లు కాదు
► కేంద్రం చెబుతున్నట్టు విశాఖ ఉక్కు ఆస్తి రూ.31 వేలకోట్లు కాదు. రూ.లక్షన్నర కోట్లకుపైగా ఉంటుంది. మమ్మల్ని రాజీనామా చేయమంటున్న పవన్‌కళ్యాణ్ అసలు తానేం చేస్తున్నాడు? మేం రాజీమానా చేసినా మళ్లీ గెలుస్తాం. ప్రయోజనం ఏంటి? నువ్వెళ్లి పొత్తు పెట్టుకున్న పార్టీని ఒప్పించలేవా?
► విశాఖ స్టీల్ కోసం వచ్చిన కొరియన్ కంపెనీ పోస్కోను.. కడప, కృష్ణపట్నంకు వెళ్లండని ప్రభుత్వం సలహా ఇచ్చింది. వాళ్లు కృష్ణపట్నం వైపు ఆసక్తి చూపుతున్నారు. జగన్ దాపరికం లేని నాయకుడు. స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకునేందుకు ఆయన చేసిన సూచనలను ఎవరైనా అభినందిం చాల్సిందే. కానీ ఎల్లో మీడియా వక్రీకరిస్తోంది.
జగన్‌ను ఎదుర్కొనే శక్తి లేకే తప్పుడు ఆరోపణలు
► విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు విషం కక్కుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానాన్ని పక్కదారి పట్టించేలా రాశాయి.
► అవసరమైతే ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని ఆమె సాధారణ భాషలో చెబితే.. ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతిచ్చినట్టు రాశారు. అదే నిజమైతే ఈ స్థాయిలో ఎందుకు ఉద్యమిస్తాం? బంద్‌కు ప్రభుత్వం ఎందుకు మద్దతిస్తుంది?
► విశాఖ స్టీల్‌ను జగన్ కొంటారనే ప్రచారం దుర్మార్గం. అసలు ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకున్న చంద్రబాబు దగ్గరే డబ్బులున్నాయి. విశాఖ స్టీల్‌ను కొనమని ఆయనకు సలహా ఇస్తున్నాం.