
సాక్షి, అమరావతి: నేరం చేసిన వాళ్లే.. దొంగా..దొంగా అంటూ అరిచిన చందంగా టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మహిళల కోసం నారీ సంకల్ప దీక్ష అంటూ మహిళాభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం జగన్‌పై విమర్శలకు తెగబడుతోందని మండిపడ్డారు. వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సోమవారం వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెడుతూ శక్తివంతమైన నాయకుడిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారని చెప్పారు.
చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేయలేనిది జగన్ రెండున్నరేళ్ల పాలనలో చేసి చూపించారన్నారు. దీనిని చూసి ఓర్వలేక టీడీపీ, దాని దుష్ట మీడియా దుష్ప్రచారానికి ఒడిగడుతున్నాయని మండిపడ్డారు. ‘విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ జైన్ లైంగిక వేధింపులకు పాల్పడి 14 ఏళ్ల అమ్మాయి జీవితాన్ని బలితీసుకున్నాడు. బాధితులది విద్యాధిక కుటుంబం. ఎవరికీ చెప్పుకోలేక చిన్నారి ఆత్మహత్యకు పాల్పడింది. కారకులు ఎవరో బహిరంగంగా అందరికి తెలిసినా కూడా టీడీపీ మహిళల కోసం నారీ సంకల్ప దీక్షలు అంటూ కొత్త నాటకాలకు తెరదీసింది. లేనివి కల్పించి ప్రత్యేక కథనాలు, డిబేట్లు నిర్వహించే చానల్స్ వారికి మద్దతుగా ఉన్నాయి.
మహిళలపై నేరాల విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనడానికి చాలా ఉదాహరణలున్నాయి. మహిళలపై వేధింపులకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కోటి మందికి పైగా మహిళలు, విద్యార్థినులు దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారంటే ప్రభుత్వంపై వారికి ఉన్న నమ్మకమే కారణం. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని సరైన రీతిలో ఎదుర్కోవాలి. ప్రజలకు వాస్తవాలు తెలపాలి’ అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విద్యా రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు ప్రవేశపెడుతున్నట్టు వివరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళాభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని, మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ను తప్పనిసరి చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సంధానకర్తగా
వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment