మీడియాతో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి. పక్కన పార్టీ నేతలు
సాక్షి, అమరావతి: ‘పరిషత్’ ఎన్నికల ఫలితాలతో మూడోసారి కూడా ప్రజలు వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని అందించారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలు వైఎస్సార్‌సీపీని డిస్టింక్షన్ మార్కులతో పాస్ చేసి తమ బాధ్యతను మరింత పెంచారన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సజ్జల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలకు పార్టీ, సీఎం వైఎస్ జగన్ తరఫున కృతజ్ఞతలు చెప్పారు. మాజీ ఎన్నికల కమిషనర్, టీడీపీ ఏజెంట్ నిమ్మగడ్డ రమేష్‌కు, ఎన్నికలు ఆపడానికి కుట్రలు పన్నిన చంద్రబాబుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లకు వచ్చిన ఈ ఎన్నికల్లో జగన్ పాలన శభాష్ అనే తీర్పును ప్రజలు ఇచ్చారని చెప్పారు. పాలకుడి విశ్వసనీయత నచ్చితే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారన్న దానికి ప్రస్తుత ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కోవిడ్‌తో ప్రపంచమే కుదేలైనా.. సంక్షేమ పథకాలతో కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నారని కొనియాడారు. టీడీపీ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల అప్పు మిగిల్చిపోయినా.. నిబ్బరంగా ముందుకు సాగుతున్నారన్నారు. 2019లో 50 శాతం ఓట్లతో ప్రజలు ఆదరిస్తే.. ఇప్పుడు దాదాపు 90 శాతం ప్రజలు ఆదరించారని తెలిపారు. నాయకుడంటే ఎలా ఉండాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను చూసి నేర్చుకోవాలని చంద్రబాబుకు తన చిన్నాన్న గతంలో సలహా ఇచ్చారన్నారు. ఇదే తరహాలో నాయకుడంటే ఎలా ఉండాలో జగన్‌ను చూసి నేర్చుకోవాలని చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు చెప్పాలని సూచించారు.
టీడీపీ భవిష్యత్‌కు కుప్పం ఫలితమే నిదర్శనం
టీడీపీ భవిష్యత్ ఏంటో చెప్పడానికి కుప్పం ఫలితం ఒక్కటి చాలని సజ్జల అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలోనూ వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతోందని గుర్తు చేశారు. 2014లో 50 వేలు ఉన్న చంద్రబాబు మెజారిటీని 2019లో 27 వేలకు తగ్గించామన్నారు. ప్రస్తుతం కుప్పంలోని నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందామని చెప్పారు. అక్కడ తమకు సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 43 వేల ఓట్లు రాగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 62,957 ఓట్లు వచ్చాయన్నారు. కుప్పం మునిసిపాలిటీని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ మెజారిటీ 70 వేలు దాటుతుందని తెలిపారు. దివాలా తీసి, ఐపీ పెట్టిన దశలో టీడీపీ ఉందన్నారు. ఆ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలకు రెట్టింపు ప్రతిపక్షంలో ఉంటూ చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ ఎన్నికల బహిష్కరణ ఒక డ్రామా
పరిషత్ ఎన్నికల్లో ఓటమిని ముందే గుర్తించిన టీడీపీ నామినేషన్‌లు వేసి, ఉపసంహరణలు కూడా పూర్తయ్యాక ఎన్నికలను బహిష్కరిస్తున్నామని డ్రామాకు తెరలేపిందని దుయ్యబట్టారు. ఓవైపు ఎన్నికలను బహిష్కరించామంటూనే జనసేనతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని మండిపడ్డారు. స్థానిక పరిస్థితులను బట్టి జనసేన, టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం టీడీపీ నేతలు ప్రచారం చేశారని ఆరోపించారు. ఇందుకు వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు.
ప్రజా తీర్పును స్వాగతించకుండా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వితండ వాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2020 మార్చిలోనే జరగాల్సిన పరిషత్ ఎన్నికలను టీడీపీ కుట్రలు పన్ని నిమ్మగడ్డ రమేష్ సహకారంతో అడ్డుకుందన్నారు. టీడీపీ అంటేనే తాలిబన్ దేశం పార్టీ అని విమర్శించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండడం చేతకాక అసభ్య దూషణలు చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడటం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు.. మేరుగ నాగార్జున, మొండితోక జగన్మోహన్‌రావు, ముస్తఫా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment