సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ, వైఎస్సార్‌సీపీ ప్లీనరీ విజయవంతం కావటాన్ని చూసి సహించలేక టీడీపీ విష ప్రచారానికి పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలు, కొండలను తోడేశారంటూ శోకాలు మొదలు పెట్టారని విమర్శించారు.
ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం కార్యక్రమాలు కొనసాగుతుంటే ఓర్వలేక చంద్రబాబు రాష్ట్రానికి ప్రథమ శత్రువులా తయారయ్యారని ధ్వజమెత్తారు. టీడీపీ సర్కారు హయాంలోనే గనుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చారనే సంగతి తెలుసుకుంటే మంచిదని సూచించారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పాత ఫోటోలతో చంద్రబాబు బురిడీ రాజకీయం ప్రారంభించారని చెప్పారు. మైనింగ్ మాఫియా ఫోటో ఎగ్జిబిషన్ అంటూ చంద్రబాబు బరి తెగించి బుకాయించటాన్ని రుజువులతో సహా మీడియాకు బహిర్గతం చేశారు.
పాత ఫొటోలు ప్రచురించి...
కొండను తవ్వారు.. అది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నిర్వాకం అంటూ చంద్రబాబు విమర్శించిన ఫొటోలను ఈనాడు ప్రచురించింది. నిజానికి అది 2018లో సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో. ‘మన తెలుగు జోక్‌లు. ప్రతి ఇంటా నవ్వుల పంట’ అన్న దాంట్లో ఆ ఫొటో చాలా రోజుల క్రితం వాడారు. ఇలా ఉంటే బోరు ఎలా కొట్టాలి అంటూ.. ఆ ఫొటో పోస్టు చేశారు. పాత ఫొటోను చూపిస్తూ ఎమ్మెల్యే ద్వారంపూడిపై చంద్రబాబు నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారు. చంద్రబాబు బరి తెగింపు, అదుపులేనితనానికి ఇదే నిదర్శనం.
ఇది మరో విచిత్రం.. కొండను తవ్విన ఫొటో. ఇది మంగళగిరి రోడ్‌లో టీడీపీ ఆఫీస్ దగ్గరే ఉంది. దాన్ని కూడా టీడీపీ హయాంలోనే తవ్వేశారు. మరో ఫొటోలో ఉన్న కొండ ఇక్కడికి (తాడేపల్లి) దగ్గర్లోనే ఉంది. దాన్ని కూడా టీడీపీ హయాంలోనే తవ్వేశారు. వీటిని మీడియా సందర్శించి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలి.
► చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రం మరో అమెరికా.. లేకపోతే శ్రీలంక అన్నట్టుగా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబు హయాంలో యథేచ్ఛగా ఇసుక దోపిడి జరిగింది. నాడు అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్టీజీ రూ.100 కోట్ల ఫైన్ విధించిన విషయం గుర్తున్నా నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారు.
► రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వాటికి అవసరమైన మట్టి, ఇసుక, సిమెంట్ తరలింపు, రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకే చంద్రబాబు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు.
► లేటరైట్ లేకుండా సిమెంట్ తయారు చేయొచ్చా? రోడ్ల మీద కంకర లేకుండా గుంతలు ఎలా పూడుస్తారు?. మట్టి తవ్వకుండా ఎలా మట్టిని రోడ్డుపై నింపుతారో చంద్రబాబు చెప్పాలి.
► ఎక్కడ ఇసుక తవ్వినా చట్ట ప్రకారమే జరుగుతుంది. ఎక్కడైనా ఉల్లంఘన జరిగితే ప్రభుత్వం స్పందిస్తుంది. మైనింగ్ విభాగం చాలా సమర్థంగా పని చేస్తోంది. తాజాగా జాతీయ స్థాయిలో గుర్తింపు, అవార్డు దక్కించుకోవడం ఆ శాఖ పనితీరుకు నిదర్శనం.
► చంద్రబాబు హయాంలో అమరావతి దగ్గర కృష్ణా నదిలో అక్రమంగా ఇసుక తవ్వితే ఎన్జీటీ స్పందించి రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఇప్పటికీ అక్కడ తవ్వకాలకు పర్మిషన్ లేదు. దానిపై అప్పట్లో మా పార్టీ నాయకుడు హనుమంతరావు కోర్టును కూడా ఆశ్రయించారు.
► విశాఖ రుషికొండపై నిర్మాణాలు ఎప్పటి నుంచో పర్యావరణ నిబంధనలకు లోబడి నిబంధనల ప్రకారం అనుమతితోనే జరుగుతున్నాయి. శుక్రవారం అక్కడ సీఎం కార్యక్రమం ఉన్నందున ఇవాళ విపక్షం హడావుడి చేస్తోంది. వాహనమిత్ర కింద రూ.10 వేల సహాయం చేస్తున్నాం. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే ఈ కుట్రలు.
► చంద్రబాబు విఫల నేత. అడ్డదారిలో అధికారంలోకి వచ్చారు. చివరకు ఒక నియోజకవర్గాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిన వ్యక్తి. కుప్పం ఆయన చేజారిపోయింది. ఇప్పటికే సర్పంచ్, మున్సిపాలిటీ, ఎంపీటీసీ పోయింది. రేపు ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది. దీంతో ఫ్రస్ట్రేషన్‌లో ఏం చేయాలో దిక్కుతోచక అనైతికంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మాటలు సోషల్ మీడియాలో జోకుల కోసం పనికొస్తాయి.
► భారీ వర్షాలు కురుస్తున్నందున దెబ్బతిన్న రహదారులను బాగు చేస్తాం. చంద్రబాబు హయాంలో రోడ్ల నిర్మాణం లేదు.
Comments
Please login to add a commentAdd a comment