
టీ.నగర్: శశికళకు మద్దతుగా అన్నాడీఎంకే తరఫున వెలసిన పోస్టర్లు పార్టీ వర్గాల్లో సంచలనం కలిగించాయి. చెన్నై ప్రధాన కార్యాలయం ఎదుట, పుదుక్కోట్టై ప్రాంతంలో వీటిని అతికించారు. ఎన్నిక లు ముగిసిన తర్వాత అన్నాడీఎంకే ప్రతిపక్షనేత పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఓపీఎస్ తరఫున ఒక వర్గం, ఎడపాడి పళనిసామి ఆధ్వర్యంలో ఓ వర్గం తలపడుతున్నాయి.
రెండు రోజుల క్రితం ఎడపాడి పళనిసామి కారును ఓపీఎస్ వర్గం అటకాయించి నినాదాలు చేసింది. ఆ తర్వాత అన్నాడీఎంకే నిర్వాహకుల సమావేశంలోను నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహారంలో శశికళ తెరవెనుక నుంచి ఓపీఎస్‌కు మార్గదర్శకం చేస్తున్నట్లు వార్తలు వెలువడడంతో సంచలనం ఏర్పడింది. ఇలావుండగా చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎదురుగా శశికళకు మద్దతు తెలుపుతూ పోస్టర్లు వెలిశాయి.
అలాగే పుదుక్కోట్టై ప్రాంతంలోను అన్నాడీఎంకే కార్యకర్తల తరఫున పోస్టర్లు అతికించారు. ఎంజీఆర్ రూపొందించిన, జయలలిత కాపాడిన పార్టీని శశికళ ఆధ్వర్యంలో నడిపిద్దామని అందులో రాశారు. అన్నాడీఎంకేలో ఇంకా ప్రతిపక్షనేత ఖరారు కాని స్థితిలో ఇలా పోస్టర్లు వెలియడం పార్టీ వర్గాలలో కలకలం రేపింది.
చదవండి:
విద్యార్థి నేత నుంచి సీఎం పీఠం వరకు
ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ..!