
నెల్లూరు: తమ వెబ్‌సైట్ గురించి సోమిరెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి. సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఎండీ స్పందించారు. ‘‘ఈ వెబ్‌సైట్ వెనుక ఎలాంటీ దోపిడీ ఉండదు, అంతా పారదర్శకం. టెస్టింగ్ చేసే క్రమంలోనే వెబ్‌సైట్‌లో రేట్లు పెట్టుకున్నాం.. అవి ఫైనల్ కాదు. ఈ అంశాన్ని సోమిరెడ్డి ఇలా రాజకీయం చేయడం దుర్మార్గం. ఎమ్మెల్యే కాకాణికి, మా వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదు’’ అని స్పష్టం చేశారు.
మందు పంపిణీ విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదు: కాకాణి
ఆనందయ్య మందు విషయంలో వ్యక్తిగత విమర్శలు చేసి.. ప్రతిపక్షాలు రాజకీయ రగడ సృష్టించాలని చూస్తున్నాయి అన్నారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆనందయ్య మందుకు అనుమతులు వచ్చేవరకే ప్రయత్నం చేశా. ఆనందయ్య మందు పంపిణీ విషయంలో.. పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని కాకాణి స్పష్టం చేశారు. అన్ని జిల్లాలకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ.. ‘‘సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దిగజారి విమర్శలు చేస్తున్నారు. సోమిరెడ్డి ఒక్క రూపాయైనా అవినీతి జరిగిందని నిరూపించలగలవా. వ్యక్తిగత విమర్శలతో సోమిరెడ్డి బురదజల్లాలని చూస్తున్నాడు. సోమిరెడ్డికి నన్ను విమర్శించే హక్కు లేదు. ఎక్కువగా మాట్లాడితే సోమిరెడ్డి అప్పుల చిట్టా విప్పుతా. సోమిరెడ్డి పేకాటలో ఎంతమందికి అప్పులు ఉన్నాడో చెప్పాలి’’ అని కాకాణి డిమాండ్ చేశారు.
‘‘సోమిరెడ్డికి ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో బయటపెట్టాలి. సోమిరెడ్డి ఆధారాలతో వస్తే విచారణకు సిద్ధం. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలి. ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. సోమిరెడ్డి నీతి మాటలు కట్టిపెట్టి వాస్తవాలు మాట్లాడాలి’’ అంటూ కాకాణి తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment