
ఏలూరులో మౌన దీక్షలో వీర్రాజు
ఏలూరు (టూటౌన్)/ గుంటూరు మెడికల్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని, దేశ ప్రజలకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దేశ ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఏలూరు, గుంటూరు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం మౌన దీక్షలు నిర్వహించారు.
ఏలూరులోని గాంధీ మైదానం సెంటర్‌లో గాం«ధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సోము వీర్రాజు మాట్లాడారు. ప్రధాని మోదీకి ప్రపంచ వ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు రావడంతో కాంగ్రెస్ తట్టుకోలేక దుష్ట పన్నాగాలు పన్నుతోందని ఆరోపించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ లీగల్ సెల్ చైర్మన్ జూపూడి రంగరాజు మాట్లాడారు.